Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్, సొసైటీ నిధుల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి
- ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ యాజమాన్యం ప్రజా రవాణాను ప్రజలకు దూరం చేసే కుట్ర పన్నుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. వివిధ సెస్‌ల పేరుతో ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నదని తెలిపింది. 2019లో 55 రోజుల సమ్మె తర్వాత నేటికీ ఒక్క సమస్యనూ పరిష్కరించకపోగా, ట్రేడ్యూనియన్లపై నిషేధం విధించి కార్మికుల హక్కులను కాలరాసిందని పేర్కొంది. వారి శ్రమను దోచుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఆదాయం రావడం లేదనే పేరుతో అనేక బస్సు సర్వీసులను రద్దు చేసి, డిపోలను మూసివేయచూస్తున్నదని విమర్శించింది. ఇది సరైందికాదని తెలిపింది. ప్రజా రవాణాను ప్రజలకు దూరం చేయొద్దనీ, ఆర్టీసీని రక్షించి, ప్రజలపై భారాలను తగ్గించాలనీ, కార్మికుల హక్కులను కాపాడాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ యాక్ట్-1950 ప్రకారం రోడ్డు రవాణా సౌకర్యాలు విస్తరించి మెరుగుపర్చి, సమర్థవంతమైన వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వమందించాలని వివరించారు. రోడ్డు రవాణా అభివృద్ధి ద్వారా ప్రజలకు, వాణిజ్యానికి, పరిశ్రమలకు ప్రయోజనాలందించాలని సూచించారు. ఇతర రవాణా సదుపాయాలతో ప్రజా రవాణాను సమన్వయం చేయాలని తెలిపారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రవర్తిస్తున్నదని విమర్శిచారు. ఆర్టీసీ ఛార్జీల సర్దుబాటు పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా 20 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు రూ.పది వరకు బస్టిక్కెట్ల రేట్లను, రూ.250 నుంచి రూ.500 వరకు బస్‌పాస్ రేట్లను పెంచిందని గుర్తు చేశారు. మరో దఫా పెంచేందుకు యాజమాన్యం సిద్ధపడుతున్నదని పేర్కొన్నారు. ఛార్జీల సర్దుబాటు పేరుతో రూ.35 లక్షలు ఫ్యాసింజర్ సేఫ్టీసెస్ పేరుతో రూ.32 లక్షలు, ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్ పేరుతో రూ.32 లక్షలు, డీజిల్ సెస్ పేరుతో రూ.1.60 కోట్లు ప్రతి రోజూ ప్రయాణీకులపై భారం మోపుతున్నదని విమర్శిచారు. కార్మికుల సామాజిక బాధ్యతను యాజమాన్యం గాలికొదిలిందని తెలిపారు. వారికి న్యాయమైన వేతనాలు, పీఎఫ్, నివాస వసతి, వినోద స్థలాలు, విశ్రాంతి తదితర సౌకర్యాలు కల్పించాలని చట్టం చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. 2015 వేతన ఒప్పంద బకాయిల్లో నేటికీ సగభాగం చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు రెండు వేతన ఒప్పందాలు జరగాలని వివరించారు. ఆరు డీఏలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒక డీఏను ఐదు శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. పీఎఫ్ నిధులు రూ.1,400 కోట్లు, కో-ఆపరేటీవ్ సొసైటీ డబ్బులు రూ.900 కోట్లు ప్రభుత్వం వాడుకుని చెల్లించడంలేదని తెలిపారు. ఆర్టీసీ పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగించాలనీ, బస్టిక్కెట్టు, బస్‌పాస్ రేట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఆర్టీసీకున్న అప్పులను ఈక్విటీగా ప్రకటించాలని, బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించాలని కోరారు. సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు అందించాలని సూచించారు. కార్మికులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనీ, వారి హక్కులను కాపాడాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.