Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండిల్ తెరిచారా? లేదా?
- కోదాడ పరీక్షా కేంద్రంలో ఏం జరిగింది...
- ఇంటర్ బోర్డు, డీఐఈవో విరుద్ధ ప్రకటనలు
- పొరపాటున వేరే సబ్జెక్టు ప్రశ్నాపత్రం వచ్చిందన్న బోర్డు కార్యదర్శి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సోమవారం నిర్వహించిన ఇంగ్లీష్ పేపర్-1 నిర్వహణకు సంబంధించి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సిటీ సెంట్రల్ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఏం జరిగిందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రశ్నాపత్రాల బండిల్‌ను పరీక్ష నిర్వాహకులు తెరిచారా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, సూర్యాపేట డీఐఈవో ప్రభాకర్‌రెడ్డి పరస్పర విరుద్ధ మైన ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆ పరీక్షా కేంద్రంలో సోమవారం ఉదయం పరీక్ష ప్రారంభానికి ముందు ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కోదాడలోని ఆ పరీక్షా కేంద్రానికి పొరపాటున వేరే సబ్జెక్టు ప్రశ్నాపత్రం సరఫరా అయ్యిందంటూ జలీల్ ప్రకటించారు. ప్రింటర్ ద్వారా తప్పుడు బండిల్ సరఫరా చేశామని అంగీకరించారు. వాటిని తెరవకముందే ఆ విషయాన్ని గుర్తించి ఇతర కేంద్రాల నుంచి ఇంగ్లీష్ పేపర్-1 ప్రశ్నాపత్రాలు తెప్పించి పరీక్ష నిర్వహించామని తెలిపారు. దీంతో గంట ఆలస్యమైందని వివరించారు. కానీ డీఐఈవో ప్రభాకర్‌రెడ్డి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడారు. ప్రశ్నాపత్రం బండిల్ తెరిచామనీ, అందులో 45 ప్రశ్నాపత్రాలు తక్కువగా వచ్చినట్టు గుర్తించామని మీడియాకు ప్రకటించారు. ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశాలతో ఇతర కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాలు తెప్పించి పరీక్షను గంటంపావు ఆలస్యంగా నిర్వహించామని వివరించారు. అందుకే ఆలస్యమైందన్నారు. ఇక్కడ ఇంటర్ బోర్డు కార్యదర్శి, డీఐఈవో ప్రకటనలు ఒకదానికి ఒకటి పొంతనలేని విధంగా ఉండడం గమనార్హం. దీంతో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇంకోవైపు డీఐఈవో చెప్పినట్టు 45 ప్రశ్నాపత్రాలు తెచ్చేందుకు గంటంపావు ఆలస్యమవుతుందా?, అధికారుల తీరు వల్ల అందరిలోనూ పలు సందేహాలు వస్తున్నాయి.
బాధ్యతెవరిది... చర్యలేవీ...
ఇంటర్ పరీక్షలకు నిమిషం ఆలస్యమె ౖతేనే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండబోదని ఇంటర్ బోర్డు స్పష్టంగా ప్రకటించింది. అలాంటిది గంటంపావు ఆలస్యంగా పరీక్ష నిర్వహిం చడం ఇంటర్ బోర్డు అధికారుల బాధ్యతారాహి త్యానికి నిదర్శనం. దీనికి బాధ్యులెవరు?. కోదాడ పరీక్షా కేంద్రంలో ఇంగ్లీష్ పేపర్-1కు బదులుగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం రావడంలో తప్పు ఎక్కడ జరిగిం ది, ఎవరు చేశారన్నది కీలకం. పరీక్ష ఆలస్యంగా జరిగిందనేది వాస్తవం. అయినా విద్యాశాఖ ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం గమ నార్హం. ఇంటర్మీడియెట్ విద్యార్థుల పరీక్షల పట్ల, వారి జీవితాల పట్ల ప్రభుత్వం, విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో దీన్నిబట్టి అర్థమవుతున్నది. ఇంకోవైపు గతంలో ఇంటర్ జవాబు మూల్యాంకనం, మార్కుల్లో జరిగిన అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మనస్థాపం చెంది సుమారు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు కోదాడలో ఓ పరీక్షా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది జరిగితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తలు వహించి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించాలి. అయితే ఈ ఘటనలో భాగస్వామ్యం ఉన్న కొందరిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుపుత్తుున్నట్టు సమాచారం.
సమగ్ర దర్యాప్తు జరపాలి : రామకృష్ణగౌడ్
సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇంగ్లీష్ పేపర్-1కు బదులుగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం వచ్చిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిప్స్ రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్ డిమాండ్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంటర్ పరీక్షల పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంగా ఇంటర్ బోర్డు అధికారులు వ్యవహరించడం సరైంది కాదని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షల పట్ల నమ్మకం కలిగించాలని సూచించారు. సీసీ కెమెరాను పరిశీలించాలని కోరారు.
ప్రశ్నాపత్రం తెరవలేదు : మధుసూదన్‌రెడ్డి
సూర్యాపేట జిల్లా కోదాడలోని సిటీ సెంట్రల్ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఇంగ్లీష్ పేపర్-1 ప్రశ్నాపత్రాన్ని తెరవ లేదని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ పి మధు సూదన్‌రెడ్డి నవతెలంగాణతో చెప్పారు. వేరే ప్రశ్నా పత్రం వచ్చిందంటూ గుర్తించిన అధికారులు వెంటనే ఇతర పరీక్షా కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాలను తెప్పించి ఆలస్యంగా పరీక్ష నిర్వహించారని అన్నారు. విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు.