Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సప్పుడు లేకుండా గ్రీన్ టాక్స్ పెంపు
- బైక్‌లకు రూ.250 నుంచి రూ.2,500కు...
- కార్లకు రూ.500 నుంచి రూ.5వేలకు పెంపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రవాణాశాఖలో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు లైఫ్ టాక్స్‌ను భారీగా పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం సప్పుడు లేకుండా తాజాగా గ్రీన్ టాక్స్‌నూ పెంచేసింది. దీనికి సంబంధించి అధికారికంగా వెలువడిన ప్రకటనలు ఏవీ కనిపించలేదు. కానీ రవాణాశాఖ వెబ్సైట్లో గ్రీన్‌టాక్స్ కాలమ్ కోసం పేరు, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే, పెరిగిన పన్నును చూపిస్తున్నది. ఈ విషయాన్ని రవాణా శాఖ ఉద్యోగి ఒకరు ఖరారు చేసి, వెబ్సైట్లో చూపించారు. 15 ఏండ్లు దాటిన వాహనాలకు రీ రిజిస్ట్రేషన్ చేయిస్తే, పెరిగిన ఛార్జీలతో పాటు పెరిగిన గ్రీన్టాక్స్నూ చెల్లిస్తేనే స్లాట్ రిజిస్టర్ అవుతుంది. 15 ఏండ్లు దాటిన ద్విచక్ర వాహనానికి గతంలో గ్రీన్ టాక్స్ రూ.250 ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.2,500కు పెంచారు. కార్లకు గతంలో గ్రీన్‌టాక్స్ రూ.500 ఉండగా, దాన్ని రూ.5వేలకు పెంచారు. ఇవే వాహనాలకు 20 ఏండ్లు దాటితే రూ.5వేలు (టూవీలర్‌కు), రూ.10వేలు (కార్లకు) చెల్లించాలి. ఈ వ్యవహారమంతా అంతర్గత సర్క్యులర్ల ద్వారా ఈనెల 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు రవాణాశాఖ ఉద్యోగులు చెప్తున్నారు.
రవాణా కమిషనర్‌గా కేఎస్ శ్రీనివాసరాజు
రవాణాశాఖ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లో ఉన్న ఎమ్‌ఆర్‌ఎమ్ రావు ఏప్రిల్ 13 నుంచి మే 12 వరకు సెలవుపై వెళ్లారు. సెలవు పూర్తికాగానే ఆయన తన మాతృసంస్థ (ఏజీఎమ్యూటీ కేడర్ - అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం అండ్ యూనియన్ టెర్రిటరీస్)కు రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన కమిషనర్ శ్రీనివాసరాజును పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించారు.