Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నారాయణ యాజమాన్యంపై
- సమగ్ర విచారణ జరపాలి : ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన నారాయణ విద్యాసంస్థల యాజమాన్యంపై సమగ్ర విచారణ జరపాలని కోరాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, కోట రమేష్, టి నాగరాజు, ఆనగంటి వెంకటేశ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థలో పేపర్ లీకేజీతో రాష్ట్రంలోనూ ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. గతంలో తెలంగాణలోనూ ఇంటర్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలు జరిగినా, ప్రభుత్వాలు స్పందించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాలు, అధికారులను కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభావితం చేశాయని విమర్శించారు. ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం మూలంగా పదేపదే ఇలాంటి అక్రమ మార్గాలకు కార్పొరేట్ విద్యాసంస్థలు పాల్పడుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలను రద్దు చేయడమే దీనికి శాశ్వత పరిష్కారమని తెలిపారు. ఇలాంటి ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
క్రిమినల్ కేసు పెట్టాలి : పీడీఎస్‌యూ
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేసి, వాటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీఎస్‌యూ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ నాగేశ్వరరావు, బోయిన్పల్లి రాము మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం, లాభాలను పెంచుకోవడం కోసం ఏపీలో నారాయణ విద్యాసంస్థలు పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేశాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకయినపుడు ప్రభుత్వం తూతూమంత్రంగా కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఆరోపణలు వస్తే ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ లీకేజీతోపాటు కార్పొరేట్ విద్యాసంస్థలపై సమగ్ర విచారణ జరపాలనీ, బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె స్వాతి, నాయకులు చైతన్య, పవిత్ర, మేఘనాధ్, గణేష్, సౌజన్య, నందిని తదితరులు పాల్గొన్నారు.