Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండ్లి సామగ్రి వాహనాన్ని ఢకొీట్టిన టూరిస్టు బస్సు
- పేలిన డీజిల్ ట్యాంక్
- ఒకరి సజీవదహనం.. ముగ్గురికి గాయాలు
నవతెలంగాణ-జహీరాబాద్
65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి సామగ్రితో వెళ్తున్న వాహనాన్ని టూరిస్టు బస్సు ఢకొీనడంతో డీజిల్ ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో పెండ్లి కుమారుడి దగ్గరి బంధువు ఒకరు సామాన్ల మధ్యలో ఇరుక్కుని సజీవదహనమయ్యారు. పెండ్లి కుమారుడి తండ్రి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అలుగోల్ బైపాస్ చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. జహీరాబాద్ డీఎస్పీ రఘు, సీఐ తోట భూపతి, ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 9న సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో మహారాష్ట్ర లాతుర్ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. రాత్రి ఒంటిగంట సమయంలో పెండ్లి వారు తమ స్వగ్రామానికి పెండ్లి కూతురితో బయలుదేరగా, పెండ్లి సామగ్రిని అశోక్ లేల్యాండ్ వాహనంలో పెండ్లి కుమారుడి తండ్రి కలీం, ఆయన దగ్గరి బంధువులు షేక్ ఇమాం, షేక్ సమీర్ తీసుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పెండ్లి సామగ్రి వెళ్తున్న వాహనాన్ని అలుగోల్ బైపాస్ చౌరస్తా వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న సిటిజన్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తతో వచ్చి ఢకొీట్టాడు. ఈ ఘటనలో డీజిల్ ట్యాంక్ పేలడంతో సామగ్రి ఉన్న వాహనానికి మంటలంటుకొని పెండ్లి కుమారుడి బంధువు సమీర్ (42) సామాన్ల మధ్య ఇరుక్కుని సజీవదహనమయ్యారు. ట్రావెల్స్ బస్సు క్లీనర్ నగేష్ బస్సు అద్దం పగిలి కాలుతున్న వాహనంలో పడటంతో ఆయనకూ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రఘు, సీఐ తోట భూపతి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అలాగే మృతుడు సమీర్ మృతదేహానికి స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో శవ పంచనామా నిర్వహించి బంధు వులకు అప్పగించారు. షకిల్ ఫిర్యాదు మేరకు టూరిస్టు బస్సు డ్రైవర్ జగనాథ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా, మృతుడు సమీర్‌కు కొన్ని నెలల కిందటే వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడున్నాడు. పెండ్లి వారికి దగ్గరి బంధువైన ఆయన సజీవ దహనమవడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుము కున్నాయి.
తృటిలో తప్పిన పెను ప్రమాదం
ట్రావెల్స్‌కు చెందిన టూరిస్టు బస్సులో సుమారు 50 మందికి పైనే ప్రయాణికులున్నారు. సామగ్రితో వెళ్తున్న అశోక్ లెల్యాండ్ వాహనంలో కాకుండా టూరిస్టు బస్సుకు మంటలంటుకుంటే పెద్ద పెను ప్రమాదమే జరిగేదని పలువురు అభిప్రాయ పడ్డారు. తృటిలో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గతంలోనూ ఇదే చోట ఓ ట్రావెల్స్‌కు చెందిన బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టింది. టిప్పర్, లారీ ఢకొీన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు నిర్మాణంలో సరైన జాగ్రతలు పాటించకపోవడం వల్లే ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారిందని పలువురు ఆరోపించారు.