Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు..
- ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు:
- కోనాపూర్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవంలో కేటీఆర్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని తమ సర్కారు ఆరేండ్లలో చేసి చూపిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మైక్ దొరికితే చాలు కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. కేసీఆర్ రైతు కుటుంబంలో జన్మించారు కాబట్టే రైతాంగం కోసం పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారచి చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్‌లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, గ్రామపంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చొప్పదండిలో అమ్మమ్మ ఊరిలో, కోనాపూర్ నానమ్మ ఊరిలో స్వంత డబ్బులతో పాఠశాల నిర్మిస్తానని ప్రకటించారు. కేసీఆర్ రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టే రైతు కష్టాలు తెలిసి వాళ్ల సంక్షేమం కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. 63 లక్షల మంది రైతన్నలకు రైతుబంధు సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. నాలుగేండ్లలో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడంతో ఎండాకాలంలో సైతం మానేరు మత్తడి దూకుతోందని, ఇలా చూస్తానని అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్ పనితనానికి నిదర్శనమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో సాగునీరు పుష్కలంగా లభిస్తోందన్నారు. అయితే కొంతమంది వయస్సుతో సంబంధం లేకుండా మైక్ దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. మన ఊరు- మన బడి పథకం ద్వారా విద్యా యజ్ఞానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. కామారెడ్డికి మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత గంప గోవర్ధన్దని చెప్పారు. కోనాపూర్ గ్రామానికి కావాల్సిన నిధులన్నీ మంజూరు చేయమని సీఎం చెప్పారని తెలిపారు. బీబీపేట మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేస్తానని తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేండ్లలో రాష్ట్రంలో 17 వేల పరిశ్రమలను మంత్రి కేటీఆర్ నెలకొల్పి తెలంగాణలోని 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని అన్నారు. తమ నాన్నమ్మ గ్రామానికి మంత్రి కేటీఆర్ సొంత నిధులు వెచ్చించి పాఠశాల భవన సముదాయాన్ని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మిస్తున్నారని చెప్పారు. మంత్రిని చూసి తమ నియోజకవర్గాల్లో తామూ సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ పుట్టిన నాటికే 500 ఎకరాల భూస్వామని అన్నారు. మహబూబ్‌నగర్‌లో గోడలకు సున్నాలు వేసినోడు, కరీంనగర్లో చందాలు వసూలు చేసినొడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని తప్పుపట్టారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, సర్పంచ్ నరసమ్మ, జడ్పీ వైస్‌చైర్మెన్ ప్రేమ్‌కుమార్, డీసీసీబీ చైర్మెన్ భాస్కర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేష్ ధోత్రే, చంద్రమోహన్, డీసీఎంఎస్ చైర్మెన్ మోహన్, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.