Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లు కేటాయించకుంటే ఆక్రమించుకుంటాం :
- ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
నవతెలంగాణ - భువనగిరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో 5శాతం వికలాంగులకు కేటాయించుకుంటే భువనగిరి జిల్లా కేంద్రంలో ఇండ్లను ఈనెల 16న ఆక్రమించుకుంటామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య హెచ్చరించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను వికలాంగులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంలో లబ్దిదారుల ఎంపికలో వికలాంగులను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. 2017లో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో వికలాంగులకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5శాతం కేటాయించాలని మెమో జారీ చేసిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి ఇండ్లలో అద్దెలు చెల్లించలేక అనేక మంది వికలాంగులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదాని ప్రశ్నించారు. కట్టిన ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం మూలంగా కట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. ఈ నెల 14లోపు ఇండ్లు కేటాయించుకుంటే 16న పట్టణంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆక్రమించుకునేందుకు వికలాంగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా గౌరవాధ్యక్షుడు మాటురి బాలరాజు, అధ్యక్షుడు సురపంగ ప్రకాష్, కార్యదర్శి వణం ఉపేందర్, కోశాధికారి బోల్లేపల్లి స్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు కీసర వెంకట్ రెడ్డి, లలిత తదితరులు పాల్గొన్నారు.