Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిట్టెం ఆగ్రహం
- సీపీఐ(ఎం), సీపీఐ నాయకులపై టీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం
నవతెలంగాణ - అమరచింత
గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా.. దురుసుగా మాట్లాడి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు టీఆర్ఎస్ నాయకులు వామపక్ష నాయకులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని కొంకనోనిపల్లి గ్రామంలో జరిగింది. 'మన ఊరు మన బడి' కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నాయకులపై ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడారు. దాంతోపాటు టీఆర్ఎస్ నాయకులు దాడికి దిగారు. సరైన పద్ధతి కాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) నాయకులు మహేష్, మొగిలిలన్న, సీపీఐ నాయకులు వెంకటేష్ మహేష్ అన్నారు. గ్రామంలో వీధి లైట్లు, డ్రయినేజీ, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఊరి చివర్లో ఉన్న ఒంపుపై బ్రిడ్జి నిర్మించాలని వినతిపత్రం ఇవ్వడానికెళ్తే తమపై ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడారని విమర్శించారు. గ్రామ సమస్యలు పరిష్కరించాలని అడిగితే దాడికి దిగడం సరైన పద్ధతి కాదన్నారు.