Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-మహబూబాబాద్
ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపడుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, జెడ్పీ చైర్మెన్ అంగోతు బిందుతో కలిసి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో రూ.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రేడియాలజీ భవన రెండో అంతస్తుకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ..20 కోట్లతో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రి రెండో అంతస్తును, రూ.54.20 లక్షలతో నిర్మించిన 41 పడకల జనరల్ వార్డును, రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన పిల్లల సంరక్షణ కేంద్రాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం సర్జికల్ విభాగంలో పేషంట్లతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు వల్ల ఉన్న లాభాలను గర్భిణులకు వివరించి ఆ దిశగా ప్రోత్సహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. అనంతరం రూ.510 కోట్లతో చేపట్టిన వైద్య కళాశాల పనులకు, రూ.37 లక్షల వ్యయంతో చేపట్టిన ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 3 ప్రభుత్వ కళాశాలలు, 700 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 2840 మెడికల్ సీట్లు ఉన్నాయని, మరో ఏడాదిలో 5420 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు, పరీక్షా యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని రెండు జాతీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటిమయం అవుతుందని ఉమ్మడి ఏపీ సీఎంగా కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పాడని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులివ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, డీఎంఈ రమేష్‌రెడ్డి, హెల్త్ కమిషనర్ అజరు కుమార్, డీఎంహెచ్ఓ హరీష్‌రాజ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకట్రాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.