Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలి :
- పౌర హక్కుల సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బిల్లిపురం నాగరాజు హత్య ముమ్మాటికి పరువు హత్యేనని తెలంగాణ పౌర హక్కుల సంఘం అభిప్రాయపడింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలనీ, హంతకుడు మోబిన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. తమకు రక్షణ కల్పించాలంటూ నాగరాజు,ఆశ్రీన్ జంట దరఖాస్తు చేసుకున్నప్పటికి పోలీసులు స్పందించలేదని పేర్కొంది. ఆశ్రిన్‌ను అన్ని విధాల ఆదుకోవాలనీ, మత విద్వేషాలకు తావ్విరాదని కోరింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎస్లో పౌరహక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం, ఎన్ నారాయణరావు, నగర అధ్యక్షులు పి ఎం రాజు తదితరులు విలేకర్లతో మాట్లాడారు. ఆశ్రీన్ కుటుంబం కుదిర్చిన వ్యక్తిని కాదని నాగారాజును పెండ్లి చేసుకున్నదనే అక్కసు పెంచుకున్న మోబిన్ పథకం ప్రకారమే హత్య చేశాడనేది తమ నిజనిర్థారణలో తేలిందన్నారు. ఏడేండ్లుగా ప్రేమించుకుంటున్నా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెండ్లి చేసుకోవాలని ఇంత కాలం భావించారని ఇంట్లో అంగీకరించని కోరగా ఆ జంట ఒక్కటైందని పేర్కొన్నారు. ప్రమాదాన్ని పసిగట్టి రహస్యంగా బతుకుతున్నా... వెతికి వెతికి పథకం ప్రకారం చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మోబిన్ ఇంట్లో పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ పూర్తి కుటుంబంపై దాడి చేస్తూండేవాడని గుర్తు చేశారు. మోబిన్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ చెల్లెల్ని భౌతికంగా దెబ్బలు కొట్టి హింసించారని చెప్పారు. తల్లిదండ్రులను కూడా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడని తెలిపారు. తను కుదిర్చిన సంబంధం కాదనడమే కాకా వేరే మతస్థుడైన దళితున్ని పెండ్లి చేసుకోవడం వల్ల తమ పరువు పోయిందని బహిరంగంగా చెప్పేవాడని అన్నారు. పరువు హత్యకు పాల్పడటం ద్వారా పరువు తిరిగి పొందారా? అంటూ ఆశ్రిన్ ప్రశ్నిస్తున్నదని తెలిపారు. మతాంతర, కులాంంతర వివాహాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇలాంటి హత్యలు జరిగినప్పటికీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ ఆకాంక్షలను నిలబెట్టడం ప్రభుత్వ బాధ్యత, దాన్నుంచి సర్కారు తప్పుకుంటున్నదని చెప్పారు. ఇలాంటి వివాహాలకు ఆర్థిక సాయం అందించడం వరకే ఆలోచించి వారి రక్షణను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈనేపథ్యంలో వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకరావాలని డిమాండ్ చేశారు.