Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేపీహెచ్‌బీలోని ఆయన నివాసంలో
- అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
- ఆంధ్రప్రదేశ్‌కు తరలింపు
- ల్యాండ్ పూలింగ్ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ
హైదరాబాద్ : పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్మెంట్లో ఆయన నివాసంలో నారాయణను అదుపులోకి తీసుకున్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి విచారించారు. అనంతరం నారాయణ సతీమణి రమాదేవిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి సొంత వాహనంలో ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందనే ఆరోపణలతో కొద్దిరోజుల క్రితం వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌తో పాటు మరికొంతమందిని చిత్తూరు పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి నారాయణ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కుమారుడి వర్ధంతి కార్యక్రమంలో ఉండగా ఆయన్ను అరెస్ట్ చేసినట్లు నారాయణ సన్నిహితులు తెలిపారు.
ల్యాండ్ పూలింగ్ కేసు....
రాజధాని అమరావతికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్‌లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై ఏపీ సిఐడి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు పెట్టామన్నారు. ల్యాండ్ పూలింగ్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు. సోమవారం సీఐడీ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ల్యాండ్ పూలింగ్ ఎఫ్ఐఆర్లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను పోలీసులు పేర్కొన్నారు.