Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ డిమాండ్
- 18న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా
- 31న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. వేసవి సెలవుల్లో చేపడతామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరింది. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, మైస శ్రీనివాసులు, కె రఘుశంకర్‌రెడ్డి, టి లింగారెడ్డి, యూ పోచయ్య, సయ్యద్ షౌకత్ అలీ, భిక్షపతి, ఎన్ యాదగిరి, ఎస్ హరికృష్ణ, శాగ కైలాసం, చింతా రమేష్, వై విజయకుమార్, మసూద్ అహ్మద్, నాయకులు ఎం రవీందర్, టి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021, మార్చి 22న, ఈ ఏడాది మార్చి 10 తేదీల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామంటూ సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. విద్యామంత్రి సైతం వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని హామీ ఇచ్చారని చెప్పారు. ఉపాధ్యాయులందరూ బదిలీలు, పదోన్నతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. వేసవి సెలవులు ప్రారంభమై రెండు వారాలు గడిచినప్పటికీ షెడ్యూల్ విడుదల కాకపోవటం వల్ల తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. ఈ ఏడాదీ పదోన్నతులు, బదిలీలు జరుగవేమో అనే నిస్పృహలో ఉన్నారని చెప్పారు. ఉపాధ్యాయుల అనుమానాలకు తెరదించుతూ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పది మూల్యాంకనం బహిష్కరణ
ఈనెల 16వ తేదీ నాటికి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల కాని పక్షంలో 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామంటూ యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ హెచ్చరించింది. ఈనెల 31వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని ప్రకటించింది. ఇతర ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పదో తరగతి విద్యార్థుల మూల్యాంకనం బహిష్కరణకూ సిద్ధపడతామని స్పష్టం చేసింది. 317 జీవో అమలు కారణంగా ఏర్పడిన సీనియార్టీ, స్పెషల్ కేటగిరీ సమస్యలు, భార్యాభర్తల అప్పీళ్లు, పరస్పర బదిలీ దరఖాస్తులు అన్నీ సత్వరమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగుల వేతనాలను ప్రతినెలా మొదటి తేదీన విడుదల చేయాలని కోరింది. సప్లిమెంటరీ బిల్లుల విడుదలలో జాప్యాన్ని నివారించాలని సూచించింది.
పదోన్నతులపై యూఎస్పీసీ సూచనలు
8 నాన్ గెజిటెడ్ టీచర్ పోస్టులను ఇంటిగ్రేటెడ్ జిల్లా క్యాడర్‌గా ప్రకటించటంపై హైకోర్టులో ఉన్న వ్యాజ్యం దృష్ట్యా, తాత్కాలికంగా స్కూల్ అసిస్టెంట్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, హైస్కూలు హెడ్మాస్టర్ పోస్టులకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యాశాఖ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు వేర్వేరుగా పదోన్నతులు ఇవ్వాలి.
8 పైస్థాయి పర్యవేక్షణాధికారి పోస్టులను కామన్ సీనియారిటీ లేదా క్యాడర్ స్ట్రైంగ్త్ రేషియోలో రోస్టర్ నిర్ణయించి పదోన్నతులు కల్పించటానికి గల అవకాశాలను పరిశీలించాలి.
8 ఇంకా ఏవైనా కోర్టు కేసులుంటే తుదితీర్పునకు లోబడి సమీక్షించే విధంగా షరతులతో కూడిన పదోన్నతులివ్వాలి.