Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీవోకు స్వల్ప గాయాలు..
- జగిత్యాల జిల్లా బీర్పూర్లో ఘటన
నవతెలంగాణ - సారంగాపూర్(బీర్పూర్)
దారి వివాదంపై వచ్చిన ఫిర్యాదుపై విచారణకు వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు, అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా నిప్పంటుకొని ఓ అధికారికి గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మంగళవారం ఈ ఘటన కలకలం రేపింది. అదనపు కలెక్టర్ బీఎస్ లత తెలిపిన వివరాలు ప్రకారం.. తుంగూరు గ్రామానికి చెందిన యువకుడు చుక్క గంగాధర్ రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టడంతో స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై తరచూ ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్ రవి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు తహసీల్దార్ మహ్మద్ ఫరిదుద్దీన్, ఎస్ఐ గౌతమ్, ఎంపీఓ రామకృష్ణ రాజు మంగళవారం తుంగూరు గ్రామానికి వెళ్లారు. విచారణ జరిపి చుక్క గంగాధర్ రోడ్డును ఆక్రమించుకుని కట్టెలు అడ్డుగా పెట్టాడని నిర్ధారించిన అధికారులు వాటిని తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో గంగాధర్ అధికారులను అడ్డుకునేందుకు పెట్రోల్ పిచికారీ చేశాడు. ఎంపీఓ రాజు, ఎస్ఐ గౌతం అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ప్రమదవశాత్తు ఎంపీఓకు మంటలు అంటుకున్నాయి. ఎంపీవో రాజును జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజరుకుమార్, అదనపు కలెక్టర్ లత ఆస్పత్రికి చేరుకుని ఎంపీవో రాజును పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. నిందితుడు గంగాధర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.