Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంధకారంలో పీసీఏల బతుకు
- ఇదీ విద్యుత్‌శాఖ ఔట్ సోర్సింగ్ బిల్కలెక్టర్ల దుస్థితి
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
'శ్రమదోపిడీ చేయడం మంచిది కాదు.. కష్టపడేటోల్ల కడుపు నిండాలే.. ఔట్ సోర్సింగ్‌లో ఉన్న బిల్ కలెక్టర్లు వెట్టికి ఎందుకు చేస్తున్నరు.. ఈ ఔట్ సోర్సింగ్ అనేది చంద్రబాబు పెట్టిన దుకాణం.. కానీ, నిజంగా ఇది బాధాకరం.. సానుభూతితో పరిశీలిస్తాం.. కేవలం వెయ్యిమంది కదా...ఏదైనా మార్గం చూసి సమస్యలు పరిష్కరిస్తాం' అని సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 2018లో హామీనిచ్చారు. నేటికీ హామీని అమలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ పాలన దుస్థితికి నిదర్శనం. తెలంగాణా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న ప్రయివేటు కలెక్షన్ ఏజెంట్ల(పీసీఏ) ఉద్యోగ క్రమబద్దీకరణ జరిగితే వారి జీవితాలు బాగుపడతాయనుకుంటే ప్రస్తుత ప్రభుత్వ తీరుతో భారమవుతోందని బిల్ కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనగామ జిల్లావ్యాప్తంగా సుమారు 30మంది ప్రయివేటు కలెక్షన్ ఏజెంట్లు(పీసీఏ)గా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో పొద్దున లేచింది మొదలు.. తమకు చూపిన గ్రామానికి వెళ్లి వినియోగదారులు చెల్లించే బిల్లులను, పొగుచేసి వచ్చిన కలెక్షన్ డబ్బులను సంబంధిత ఈఆర్ఓలో జమ చేయడం వారి నిత్యకృత్యం. కాగా ఒక్కో కార్మికుడు రోజుకు తనకు కేటాయించిన గ్రామానికి వెళ్ళి రావాలంటే సుమారు రూ.200 దారి ఖర్చులవుతున్నాయి. కానీ, వారు సేకరించే ఒక్కో బిల్లుపై రూ.2 మాత్రమే వస్తుంది. ఎంత కాదన్నా రోజుకూ 50 బిల్లులు వచ్చినా కేవలం రూ.100 పడుతుంది. మొత్తంగా నెలకు రూ.2వేల నుంచి రూ.3వేల లోపు పడుతున్న పరిస్థితి. అదీగాక ఇటీవల ఆన్లైన్ ద్వారా నిర్వహించే బిల్లు వసూళ్లతో తమకు మరింత నష్టాన్ని కల్గిస్తోందని, నెలంతా కష్టపడి పనిచేస్తే వేతనం అంతంతమాత్రమే వస్తోందని బిల్ కలెక్టర్లు వాపోతున్నారు.
సీఎం హామీని అమలుపర్చాలి : పీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారపాక శ్రీనివాస్
రాష్ట్రమంతటా కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రయివేటు కలెక్షన్ ఏజెంట్లుగా మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు విన్నవించుకున్నా స్పందించలేదు. పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి.
భవిష్యత్ మీద ఆశతో పనిచేస్తున్నాం : పీసీఏల సంఘం జిల్లా అధ్యక్షులు కాదునూరి వినోద్, జనగామ
భవిష్యత్ మీద ఆశతో పనిచేస్తున్నాం. పదేండ్లుగా ప్రయివేటు కలెక్షన్ ఏజెంట్ (పీసీఏ)గా పనిచేస్తున్నాం. ఉద్యోగంలో చేరింది మొదలు నేటికీ పీస్ రేటుపైనే ఆధారపడి, చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. వినియోగదారుల నుంచి వసూల్ చేసే ఆదాయాన్ని బట్టి, కమీషన్ పద్ధతిలో నెలసరి వేతనాలు చెల్లిస్తుండటంతో కుటుంబ పోషణ భారమైతోంది. కనీసం దారి చార్జీలూ ఇవ్వడంలేదు. ఇప్పటికైనా స్పందించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలి.
నెలంతా కష్టపడినా గుర్తింపు కరువు : సోంపెల్లి ఫిలిప్, పీసీఏ, స్టేషన్‌ఘన్‌పూర్
సెలవు రోజుల్లో సైతం తాము విధుల్లో ఉంటున్నా తగిన గుర్తింపు లేదు. నెలంతా కష్టపడి పనిచేస్తే కూడా రూ.4వేలు వేతనం రావడం గగనమే. ప్రస్తుతమేమో కనీస గృహవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమ శ్రమను గుర్తించి పాలకులు, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేసుకుంటున్నాం.