Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరస్పర విరుద్ధ తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
- సుప్రీంకు వెళ్లేందుకు అనుమతి
న్యూఢిల్లీ: వైవాహిక లైంగికదాడి (మారిటల్ రేప్) నేరపూరితమా, కాదా అనే అంశంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చింది. మారిటల్ రేప్ నేరం కాదని పేర్కొంటున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 375వ సెక్షన్‌లోని రెండో మినహాయింపును జస్టిస్ రాజీవ్ షక్దర్ కొట్టివేశారు. మరోవైపు, లైంగికదాడి చట్టంలోని వివాదాస్పద నిబంధన చెల్లుబాటును జస్టిస్ సి.హరి శంకర్ సమర్ధించారు. ''అర్ధమయ్యే తేడా'' ఆధారంగానే ఇది వుందని వ్యాఖ్యానించారు. ఇరువురు న్యాయమూర్తులు ఇలా విరుద్ధమైన తీర్పులు ఇవ్వడంతో ఈ కేసులోని పక్షాలను సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు హైకోర్టు అనుమతించింది.
భారతదేశంలో, మారిటల్ రేప్‌ను ఏ చట్టం లేదా నిబంధన నిర్వచించలేదు. పిటిషనర్లు అయిన ఎన్జిఓ రిట్ ఫౌండేషన్, ఐద్వా , మారిటల్ రేప్ బాధితురాలు, ఐపిసి సెక్షన్ 375లోని మినహాయింపును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సవాలు చేశారు. ఈ మినహాయింపు అఘాయిత్యాన్ని నిర్వచిస్తోంది.
15 సంవత్సరాలు, ఆ పై వయస్సు గల భార్యతో ఆమె అనుమతి లేకుండా భర్త లైంగిక చర్యలో పాల్గొనడం లైంగికదాడి కిందకు రాదని ఈ మినహాయింపు పేర్కొంటోంది. కానీ, 2017 అక్టోబరులో సుప్రీం కోర్టు ఈ వయస్సును 18 సంవత్సరాలకు పెంచింది.
మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలవడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జిఓ మెన్ వెల్ఫేర్ ట్రస్ట్ (ఎండబ్ల్యుటి) తన వాదనలు వినిపించింది. భార్యాభర్తల మధ్య జరిగే లైంగిక చర్యను వివాహేతర సంబంధాలతో సమానంగా చూడరాదని వ్యాఖ్యానించింది. కాగా దీనిపై మొదటి పిటిషన్ 2015లో దాఖలైంది. ఈ ఏడాది జనవరిలో రోజువారీ విచారణ ప్రారంభమైంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని కేంద్రం 2017లో తన అఫిడవిట్లో పేర్కొంది. వేధించే భర్తలకు ఇదొక సులభమైన సాధనంగా మారగలదని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అదనంగా మరో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అన్ని పక్షాలతో కేంద్రం విస్తృతంగా చర్చలు జరిపిన మీదటే హైకోర్టుకు సహకరించగలమని తెలిపింది. ఈలోగా దీనిపై విచారణా కార్యకలాపాలను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై తీర్పు ఇచ్చినపుడు ఈ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఇప్పటికే గృహ హింసచట్టంలో లైంగిక వేధింపులనేవి నేరంగా పరిగణించబడినందున ప్రస్తుత చట్టంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకుని పరిశీలించనవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.