Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నా....
- రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్‌గా తనను నియమించిన సమయంలో చాలా మంది అనుమానంతో ఎలాంటి అనుభవం లేదంటూ విమర్శలు చేశారని డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వైద్యవృత్తి ఇచ్చిన ధైర్యంతోనే గవర్నర్‌గా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. గవర్నర్‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నట్టు ఆమె వివరించారు. రాష్ట్రం నవజాత శిశువని వ్యాఖ్యానిం చారు. గైనకాలజిస్టుగా శిశువులకు చికిత్స అందించడంలో తనకు విశేష అనుభవం ఉందని గవర్నర్ చెప్పారు. వైద్యానికి సంబంధించిన అంశాలపై తనను సంప్రదించ వచ్చని తెలిపారు. ఆస్పత్రిలో మహిళలు, చిన్నారుల సంస్థను ప్రారంభించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.
రెడ్ క్రాస్ వేడుకల్లో
మరోవైపు ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన రెడ్‌క్రాస్ డే వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆ సంస్థ వ్యవస్థాపకులు హెన్రీ దునంత్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెడ్ క్రాస్ వాలంటీర్ల సంఖ్య మరింత పెంచాలని పిలుపునిచ్చారు. తలసేమియా రోగులకు రక్తమార్పిడికి సంబంధించిన ఆటంకాల్లేకుండా రెడ్ క్రాస్ కార్యకర్తలు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. జిల్లాల్లో బ్లడ్ బ్యాంక్, క్లినిక్‌ల వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు అజరు మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.