Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల కష్టాలను పట్టని మోడీ
- ప్రజాసమస్యలపై సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో బీజేపీి మతోన్మాద విద్వేష విధ్వంస విచ్ఛిన్నకర రాజకీయాలపై ప్రజలు తిరగబడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. నల్లగొండ ఎంఎస్ గార్డెన్స్‌లో సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హషం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి మతోన్మాద రాజకీయాలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించే విధానాలపై సీపీఐ(ఎం) ఎల్లప్పుడూ నికరంగా పోరాడుతుందని చెప్పారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆకలితో ప్రజలు అల్లాడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం అందుబాటులో లేవన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సమస్త ప్రజలు పుట్టెడు కష్టాల్లో ఉంటే ఇవేమీ పట్టని మోడీ ప్రభుత్వం మతాల పేరుతో తగువులు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, రాష్ట్రాల హక్కులు హరిస్తూ ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తోందని చెప్పారు. నిరంకుశ నియంతృత్వ విధానాలపై ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను, సహజవనరులను బీజేపీ ప్రభుత్వం విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలపై పోరాడుతామన్నారు. రాబోవు కాలంలో ప్రజలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు వివిధ తరగతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల ఉద్యమాలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో సమస్యల వల్ల రైతాంగం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు.