Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల ఫోరాల చైర్మెన్లపై రిట్
- విచారణకు హైకోర్టు నిరాకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పది జిల్లాల వినియోగదారుల ఫోరాలకు చైర్మెన్ల భర్తీ చర్యను సవాల్ చేసిన దాఖలైన పిటిషన్లో ఆధారాలు చూపలేదని హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను ఇద్దరు జడ్జీల డివిజన్ బెంచ్ సమర్ధించింది. విచారణ చేపట్టరాదని హైకోర్టు రిజిస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది. 20 కేసులు కూడా దాఖలు చేసిన అడ్వొకేట్లను జిల్లా ఫోరం చైర్మెన్‌గా నియమించడం చెల్లదంటూ లాయర్ రాకేష్ సింఘి వ్యక్తిగత హౌదాలో వేసిన రిట్‌ను విచారణకు అనుమతించబోమని రిజిస్ట్రీ నిర్ణయించింది. ఈ చర్యను పిటిషనర్ ప్రశ్నిస్తూ చేసిన వాదనను ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. హైకోర్టు జడ్జిగా చేసిన వ్యక్తి స్టేట్ కంజ్యూమర్స్ ఫోరం చైర్మన్‌గా నియమితులయ్యారనీ, పది జిల్లాలకు కూడా చైర్మెన్లు నియమితులయ్యారనీ, వీరిపై ఆరోపణలకు ఆధారాలు లేకుండా రిట్ వేశారని హైకోర్టు తప్పు పట్టింది. వారిని ప్రతివాదులుగా కూడా చేయలేదని తెలిపింది. నియామాకాలపై అభ్యంతరాలు ఉంటే ఇతర విధానాలను ఎంచుకోవాలని పిటిషనర్‌కు సూచన చేసింది.
ఉత్తర్వులు అవసరం లేదు
గౌరెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల్లో పది మందికి మినహా మిగిలిన 927 మందికి ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని హైకోర్టు తెలిపింది. మిగిలిన వారికి కూడా పరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చిన నేపథ్యంలో కొందరు రైతులు వేసిన రిట్‌పై విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో తదుపరి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం తమ భూమిని ప్రభుత్వం సేకరించినా పరిహారం చెల్లించలేదని మామిడి రమేష్ మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీ డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. 937 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం ఇచ్చామనీ, పిటిషనర్లతోపాటు అందరికీ వన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.8 లక్షలు అందజేశామని ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. 10 కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇవ్వాలనీ, వారికి కూడా పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. దీనిని విచారించిన హైకోర్టు గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు తెలిపింది