Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఫిట్నెస్ రెన్యువల్స్‌పై రోజుకు రూ.50 చొప్పున విధిస్తున్న జరిమానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా రవాణాబంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ రాష్ట్ర సదస్సు తెలిపింది. ఈ బంద్ సంపూర్ణంగా జరిగేలా కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చింది. బుధవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బీ వెంకటేష్, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు వి కిరణ్, క్యాబ్ జేఏసీ చైర్మెన్ షేక్ సలావుద్దీన్, లారీ యజమానుల సంఘం అధ్యక్షులు రాజేందర్‌రెడ్డి, కే అజరుబాబు (సీఐటీయూ), జీ మల్లేష్ (ఐఎన్టీయూసీ), ఎం శ్రీనివాస్ (ఐఎఫ్టీయూ), బాలనర్సింహా (టీఆర్ఎస్కేవీ), అమానుల్లాఖాన్ (ఆటో జేఏసీ), సుధాకర్‌గౌడ్ (లారీ యజమానుల సంఘం), జీ శ్రీనివాస్ (జీయూటీఎస్), నర్సింహారెడ్డి (టూరిస్ట్, ట్రావెల్స్ డ్రైవర్స్ యూనియన్), గోపాల్‌రెడ్డి (జీహెచ్సీఏడీఏ), హబీబ్ (జీమెచ్సీఏడీఏ), సలీమ (ఆటోఓనర్స్ అసోసియేషన్), జహంగీర్ (ఐఎన్టీయూసీ) తదితరులు పాల్గొని, మాట్లాడారు. రవాణారంగంలో ఓనర్ కమ్ డ్రైవర్లుగా పనిచేసేవారు ఎక్కువగా ఉన్నారనీ, వారి ఉపాధిని దెబ్బకొట్టి, రవాణారంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దానికి అనుగుణంగానే 2019 మోటార్ వెహికల్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందనీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం బలపరుస్తున్నట్టు భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్రం 714 నోటిఫికేషన్ ద్వారా ఆటో, క్యాబ్, లారీ ఫిట్నెస్ రెన్యువల్స్‌పై రోజుకు రూ.50 పెనాల్టీ భారం మోపిందనీ, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. 15 ఏండ్లు దాటిన తర్వాత ఫిట్నెస్ రెన్యువల్‌కు వచ్చే వాహనాలకు మాత్రమే రోజుకు రూ.50 పెనాల్టీ వసూలు చేయాలని ఉంటే, దాన్ని అన్ని వాహనాలకూ వర్తింపచేసి, అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారులు వాడే అద్దె వాహనాలకు చార్జీలు పెంచేందుకు రేట్ ఫేర్ కమిటీ వేయాలనీ, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2020 అమలు చేయాలనీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని సంఘాలు ఐక్యంగా చేస్తున్న ఈ పోరాటంలో కార్మికులు పెద్దఎత్తున కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. 19న జరిగే రవాణాబంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఐఎఫ్టీయూ నాయకులు వీ నవీన్ ఆహ్వానం పలుకగా, ఆటో జేఏసీ నాయకులు రఫీక్ వందన సమర్పణ చేశారు.