Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుగా మోడల్ స్కూల్, కేజీబీవీ టీచర్ల బదిలీల షెడ్యూల్ : యూఎస్పీసీ నేతలతో మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, పదోన్నతులు ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా నిర్వహించాలని నిర్ణయించామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు, పండితులు, పీఈటీల పదోన్నతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోసం ఫైల్ పంపించామనీ, అనుమతి వచ్చిన వెంటనే షెడ్యూల్ విడుదల చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నేతలకు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారనీ, ఇప్పటికే పలుమార్లు బదిలీలు, పదోన్నతులు త్వరగా పూర్తి చేయాలంటూ సూచించారని గుర్తు చేశారు. ఆ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నదని అన్నారు. ఏ వివాదాలూ లేని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను, కేజీబీవీ సిబ్బంది బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయటానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రగతి భవన్‌కు పంపిన దస్త్రాల పురోగతి కనుక్కుని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలకు ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు టెలిఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. 317 జీవో వల్ల ఉత్పన్నమైన సమస్యలపై ఉన్న అప్పీళ్లు, పరస్పర బదిలీల అంశాలపై సాధారణ పరిపాలన శాఖతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. వేసవి సెలవులు ప్రారంభమై రెండు వారాలు గడిచినా పురోగతి లేకపోవడంతో ఉపాధ్యాయులంతా ఆందోళన చెందుతున్నారనీ, వారం రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయాలని యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రిని కలిసిన వారిలో స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, టి లింగారెడ్డి, యు పోచయ్య, పి భిక్షపతి, ఎన్ యాదగిరి, ఎస్ హరికృష్ణ, ఎ శ్రీనునాయక్, బి కొండయ్య, వై విజయకుమార్, మసూద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు : టీఎస్ఎంఎస్టీఎఫ్
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల కోసం కృషి చేసిన విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు టీఎస్ఎంఎస్టీఎఫ్ అధ్యక్షులు బి కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ మహేష్ బుధవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.