Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట ఆసాములు, కార్మికుల ధర్నా
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
చేనేత చీరల ఉత్పత్తికి కూలి పెంచాలని ఆసాములు, కార్మికులు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి గంగయ్యకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడారు. సిరిసిల్లలో చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పవర్‌లూమ్‌లపై యజమానులు కాటన్ చేనేత చీరలను ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. ఆ యజమానులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ల దగ్గర పనిచేసే కార్మికులకు కూలి పెంచకుండా తక్కువ చెల్లిస్తూ శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికులు ఉపాధి కోల్పోకుండా.. 11రకాల ఉత్పత్తులను పవర్‌లూమ్స్‌పై నడిపించకుండా ప్రభుత్వం 1985లో చేనేత రిజర్వేషన్ చట్టాన్ని చేసిందన్నారు. కానీ నేడు చేనేత రిజర్వేషన్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకుంటే కార్మికుల ఉపాధి పోతుందన్న ఒకే ఒక్క అంశం మీద అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యజమానులు దీన్ని ఆసరాగా చేసుకొని కార్మికుల కూలి పెంచకుండా, అధికారుల మాటలను కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. రిజర్వేషన్ చట్టం ప్రకారం అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కమిషనర్‌కు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఒడ్నాల వీరేశం, నల్ల మార్కండేయులు, సూర్యనారాయణ, రమణ, శివకుమార్, బాలరాజు, కనకయ్య, రాజేశం, యాదగిరి, పోశెట్టి, నర్సయ్య, కిరణ్ పాల్గొన్నారు.