Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
- ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి
- అందరికీ విద్యా వైద్యం, భూమి, ఇండ్లు, ఉపాధి ఇవ్వాలి
- సంగారెడ్డిలో ప్రారంభమైన తెలంగాణ వ్యకాస రాష్ట్ర కమిటీ సమావేశాలు
నవతెలంగాణ-మెదక్ డెస్క్
వ్యవసాయ, ప్రభుత్వ రంగాలను కార్పొరేట్లకు అప్పగించడం కోసమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య సంఘం జెండాను ఎగరవేశారు. అనంతరం సంఘం వ్యవస్థాపకులు పుచ్చలపల్లి సుందరయ్య, ఉమ్మడి మాజీ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల భారత దేశ సంపద, వనరులను కొల్లగొట్టే విధానానికి వ్యతిరేకంగా భూమి కోసం, దేశ రక్షణ కోసం స్వాతంత్య్ర పోరాటం జరిపారని, కానీ నేడు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అవే విధానాలు కొనసాగిస్తూ ప్రభుత్వ రంగాలను కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తోందని అన్నారు. కరోనా సమయంలో కూడా 29 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రైతులు ఉత్పత్తి చేశారని గుర్తుచేశారు. అలాంటి రంగాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ఉన్న రైల్వే, ఎల్ఐసీ, ఇతర సంస్థలను ప్రయివేటుపరం చేయడం సరికాదరన్నారు. దేశంలో 29 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 85 కోట్ల మంది ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగపడుతోందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేయడం ద్వారా ఆ కుటుంబాలన్నింటికీ ఆహారం అందే పరిస్థితి ఉండదన్నారు. దేశవ్యాప్తంగా పేద ప్రజలకు ఉపయోగపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. వేలాది ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సరైన పద్ధతిలో స్పందించడం లేదని తెలిపారు. భవిష్యత్తులో అందరికీ భూమి, ఇల్లు, ఉపాధి, విద్య, వైద్యం, ఆహార భద్రత కల్పించే విధంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్, రామ్ చందర్, ఐలయ్య, పొన్నం వెంకటేశ్వరరావు, బొప్పన పద్మ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. జయరాజ్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యం, ఐలు జిల్లా నాయకులు ఆర్. శ్రీనివాస్, సంఘం జిల్లా కార్యదర్శి ఎం. నర్సింలు, ఉపాధ్యక్షులు పీ. అశోక్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.