Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
- వాటర్‌బోర్డు ఆఫీసు ఎదుట ధర్నా
నవతెలంగాణ- సిటీబ్యూరో
బస్తీలల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, మురుగునీటి పైప్లైన్లను మార్చాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ, ఐద్వా, డీవైఎఫ్ఐ, పట్నం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పాత సీవరేజ్ పైప్లైన్లను తొలగించి కొత్త పైప్లైన్లు వేయాలని డిమాండ్ చేశారు. ధర్నానుద్దేశించి ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోని పలు బస్తీల్లో ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం, జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 70 బస్తీల్లో ఇంటింటి సర్వే చేస్తే.. కలుషిత నీటి సమస్యలే వెలుగులోకి వచ్చాయని చెప్పారు. మిషన్ భగీరథతో నీటి సమస్యను తీర్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ బస్తీవాసులకు తాగునీరు ఎందుకు అందడం లేదో
చెప్పాలని ప్రశ్నించారు. తాగునీటి కోసం హైదరాబాద్ నడిబొడ్డులో పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బస్తీవాసులను ఓటర్లుగా చూస్తున్నారే తప్ప వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమయపాలన లేకుండా అర్ధరాత్రి సైతం తాగునీరు వదులుతున్నారని చెప్పారు. రాంనగర్, భోలక్‌పూర్, అంబేద్కర్‌నగర్, జాంభవీనగర్, మొరంబొంద తదితర బస్తీల్లో డ్రయినేజీ నీటితో కలిసి కలుషితమై సరఫరా అవుతోందన్నారు. ఆ నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఉచిత నీళ్ల పేరుతో అసలు నీళ్ల సరఫరా తగ్గించారని చెప్పారు. బస్తీల్లో తాగేందుకు గుక్కెడు మంచినీ నీరు లేదు కానీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలీ లాంటి ప్రాంతాల్లో రోడ్లపై మంచినీరు వృథాగా పారుతోందని అన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మినరల్ వాటర్‌ను సప్లరు చేసినట్టు ప్రజలకు కూడా ఎందుకు అందించరని నిలదీశారు. బస్తీవాసులు తాగే నీరే అధికారులు, మంత్రులు, నాయకులూ తాగాలన్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని, అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి.నర్సింహారావు తెలిపారు. ఎక్కడైతే తాగునీరు, గాలి, ఆరోగ్యం బాగుంటాయో అక్కడే అభివృద్ధి కూడా ఉంటుందన్నారు. నల్లా నీళ్లలోనే మురుగునీరు కలిసి రావడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీరు, మురుగునీటి పైప్లైన్లు మురుగు కాల్వల్లోనే ఉంటున్నాయని చెప్పారు. పైప్‌లైన్స్ లీకేజీలు ఏర్పడినా, పగిలిపోయినా నల్లాల్లో మురుగునీరు వస్తోందన్నారు. సమయపాలన లేకుండా వస్తున్న నల్లా నీళ్లలో 10 నిమిషాలపాటు మురుగు నీరే వస్తోందన్నారు. బస్తీలో మంచినీటి సరఫరా పెంచాలని, డ్రయినేజీ పైప్లైన్లు మార్చాలని కోరారు. మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆగదన్నారు.
జలమండలి అధికారులు మొద్దనిద్ర వీడాలని ఐద్వా హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగలక్ష్మి డిమాండ్ చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో నివాసముంటున్నవారే పన్నులు కడుతున్నారా? బస్తీవాసులు కట్టడం లేదా? అని ప్రశ్నించారు. పట్నం సిటీ సెక్రెటరీ మారన్న మాట్లాడుతూ.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో మంచినీటిని మొక్కలకు వాడుతున్నారని, పేదల బస్తీల్లో మాత్రం తాగునీరే సక్రమంగా రావడం లేదని తెలిపారు. అనంతరం నాయకులు జలమండలి(ఆపరేషన్స్) జీఎం అజ్మీరాక్రిష్ణకు వినతిపత్రం అందజేశారు. అన్ని బస్తీల్లో పబ్లిక్ బోర్‌వెల్స్‌ను రిపేర్ చేయాలని, సమయానికి తాగునీరు సరఫరా చేయాలని కోరారు. జలమండలి ఎండీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వాటర్‌బోర్డు జీఎం హామీ ఇచ్చారు. ధర్నాలో సీఐటీయూ సిటీ సెక్రెటరీ ఎం.వెంకటేశ్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌తోపాటు ఆయా బస్తీవాసులు పాల్గొన్నారు.