Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'సజ్జనార్ సాబ్... ఆర్టీసీ కార్మికులపై వేధింపులకు సంబంధించి ఆధారం ఉంది, దానికి వివరణ ఇవ్వండి'అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారిపై వేధింపులు జరగడంలేదనీ, సంక్షేమ బోర్డు పనితీరు బాగుందనీ, కొంత మంది స్వార్థపరులు కావాలనే ఆర్టీసీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన ప్రకటించారని గుర్తు చేశారు. అవాస్తవాలతో కూడిన ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు అసలు సమస్యలే ఎదుర్కోవడం లేదంటూ చెప్పడం సరైందికాదని తెలిపారు. చాలా డిపోల్లో మహిళలకు కనీస సౌకర్యాల్లేని పరిస్థితి ఉందని వివరించారు. ఆర్టీసీ కార్మికులపై వేధింపులతోపాటు, వారి సమస్యలూ ఎక్కువయ్యాయని విమర్శించారు. డ్రైవర్ జీతానికి కేఎంపీఎల్కు ముడిపెడుతూ జీతాల నుండి రికవరీ చేస్తామంటూ ఆయా డిపో మేనేజర్లు, డ్రైవర్లకు నోటీస్లు పంపారని తెలిపారు. మిథాని ఆర్టీసీ డిపో డ్రైవర్ జి వెంకన్నకు ఆ డిపో మేనేజర్ రాసిన లేఖ తమ వద్ద ఉందని పేర్కొన్నారు. దాన్ని జత చేస్తున్నామని వివరించారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. ఇదీ స్వార్థపరులు చేసిందా?, దీనికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను వేధించడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించకుండా సంస్థ కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. కార్మికులకు ఇప్పటికీ రెండు వేతన ఒప్పందాలు జరగాల్సి ఉండగా సంస్థ మొండిచెయ్యి చూపిందని తెలిపారు. ఆరు డీఏలు ఇవ్వాల్సి ఉండగా, ఐదు శాతంతో కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. కార్మికుల పీఎఫ్ నిధులు రూ.1,400 కోట్లు, కో-ఆపరేటీవ్ సొసైటీ డబ్బులు రూ.900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుని
తిరిగి ఇవ్వకుండా మొండికేస్తున్నదని విమర్శించారు. ఇది కార్మికుల సంక్షేమం కాదని తెలిపారు. ఇప్పటికైనా వాస్తవాలను మరుగు పర్చకుండా, సజ్జనార్ తన అవాస్తవాలతో కూడిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమానికి తోడ్పడాలని కోరారు.