Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేత జౌళిశాఖలో అదనపు వసూళ్లు
- యారన్ సబ్సిడీ అందే కార్మికుని వివరాల నమోదుకు రూ.250 డిమాండ్
- 6 వేల మంది కార్మికుల నుంచి రూ.15లక్షలపైనే వసూలుకు రంగం సిద్ధం
- వస్త్రం గట్టాల పాస్నకూ రూ.50చొప్పున వసూలు?
నవ తెలంగాణ - కరీంనగర్
ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల టౌన్
ఇన్నాళ్లూ యారన్ సబ్సిడీ డబ్బులు రాక నానా ఇబ్బందులు పడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేస్తూ తీపి కబురును అందించింది. అయితే, కార్మికుడి ఆశను చేనేత జౌళిశాఖలో పని చేస్తున్న కొంతమంది ఆసరా చేసుకున్నారు. సబ్సిడీ నిధులు ఖాతాలో జమకావాలంటే సంబంధిత కార్మికుడి పని వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆ వివరాల నమోదుకు ఒక్కో కార్మికుని నుంచి రూ.250చొప్పున వసూలు చేస్తున్నారు. దీని ప్రకారం.. సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్న సుమారు 6వేల మంది కార్మికుల నుంచి వసూలు అయ్యేది రూ.15లక్షల పైమాటే!. మరోవైపు బతుకమ్మ చీరల గట్టాలను పాస్ చేసేందుకు ఒక్కోదానికి రూ.50చొప్పున వసూలు చేస్తున్నట్టు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, ఆర్వీఎం ద్వారా యూనిఫాం తదితర ఆర్డర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్డర్లను ఆయా మ్యాక్ సొసైటీలు, మరమగ్గాల కార్మికులకు చేనేత జౌళికశాఖ ద్వారా అప్పగిస్తోంది. ఈ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపైనే భారం అవుతున్నా.. పనులు చేస్తున్నారు. అయితే, ఇదే శాఖలో సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం ఇటీవల కొంతమందిని కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్‌గా నియమించింది. వీరు ప్రభుత్వ ఆర్డర్లు తీసుకున్న సంబంధిత ఎస్ఎస్ఐ యూనిట్, మ్యాక్ సొసైటీలు సహా ఇతరులు చేస్తున్న వస్త్రం ఉత్పత్తి వివరాలను సేకరించి నమోదు చేయాలి. వారిప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కార్మికుల యారన్ సబ్సిడీకి సంబంధించిన వివరాల నమోదుకు అదనపు వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది.
ఒక్కో కార్మికుని నుంచి రూ.250 వసూలు
సిరిసిల్ల కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వ ఆర్డర్లు సహా బతుకమ్మ చీరలనూ నేసే అవకాశాన్ని కల్పిస్తోంది. బతుకమ్మ చీరల డిజైన్లు మార్పు చేయడంతో కార్మికులకు, ఆసాములకు కూలి గిట్టుబాటు కాకపోవడంతో వారు సమ్మె బాటపడ్డారు. స్పందించిన ప్రభుత్వం చర్చలు జరిపి ఆసాములకు, కార్మికులకు ఉత్పత్తి చేసిన గుడ్డకు సంబంధించి యారన్‌పై 10శాతం రాయితీ అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2018 నుంచి 2021 వరకు బతుకమ్మ చీరల యారన్‌పై 10శాతం సబ్సిడీ రావాల్సి ఉంది. ఈ సబ్సిడీ డబ్బుల కోసమూ కార్మికులు రోడ్డెక్కిన సందర్భాలూ, మళ్లీ సమ్మెకు దిగిన ఘటనలు ఉన్నాయి. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వారం కిందట 2018 ఏడాదికి సంబంధించిన యారన్ సబ్సిడీని విడుదల చేసింది. 2019 సంవత్సరానికి చెందిన రాయితీ నిధులనూ మరో వారంలోగా ప్రభుత్వం విడుదల చేయనుందని చేనేత జౌళిశాఖ అధికారులు తెలిపారు. అయితే, ఆ ఏడాది కార్మికులు నేసిన వస్త్రం వివరాలను నమోదు చేయాల్సి ఉంది. సదరు కార్మికుడి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకుగాను చేనేత జౌళిశాఖలోని సీఎఫ్‌లు రూ.250చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేగాకుండా బతుకమ్మ చీరల గట్టాలు ఒక్కోదానిపైనా రూ.50వసూలు చేసినట్టు తెలుస్తోంది. వెయ్యి మీటర్ల వస్త్రం కలిపి ఒక గట్టాగా తయారు చేస్తారు. ఈ లెక్కన బతుకమ్మ చీరలను 7కోట్ల మీటర్లు నేయగా.. ఆ చీరలను గట్టాల చొప్పున కట్టలు కడితే 7లక్షల వరకూ అవుతున్నాయి. ఒక్కో గట్టకు రూ.50చొప్పున లెక్కతీసినా రూ.35లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
మా దృష్టికి రాలేదు
సాగర్- చేనేత జౌళిశాఖ ఏడీ- సిరిసిల్ల
యారన్ సబ్సిడీ డబ్బులు అందించేందుకు కార్మికుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఆ వివరాలను ఒక్కో యజమాని, మ్యాక్ సొసైటీ, ఎస్ఎస్ఐ యూనిట్ల నిర్వాహకులు చేనేత జౌళిశాఖ ఏడీ యాప్‌కు పంపించాల్సి ఉంది. ఆ వివరాల నమోదు కోసం ఎవరైనా డబ్బులు తీసుకోవచ్చు. అయితే, గోదాములకు పంపిన గట్టాలకు ఒక్కో దానిపై రూ.50 తీసుకుంటున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై సమగ్ర విచారణ చేస్తాం. నిజనిర్ధారణ చేశాక సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.