Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై వామపక్ష, లౌకికశక్తులను కలుపుకొని ముందుకు
- రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్షాల మధ్య చర్చ
- అసమ్మతిని ప్రభుత్వం దేశ వ్యతిరేకమంటుంది
- ఇది అంగీకరించదగినది కాదు
- కేంద్ర న్యాయ శాఖ మంత్రి ముందు తెలుసుకోవాలి : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ: దేశంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై రానున్న రోజుల్లో వామపక్ష, లౌకిక శక్తులను కలుపుకొని భారీ ప్రజా పోరాటాలు చేస్తామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. ధరల పెరుగుదల, మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు, హిందూత్వ మతోన్మాద ధ్రువీకరణకు వ్యతిరేకంగా, ప్రజల జీవనోపాధి, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం కోసం పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభ తరువాత ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సోమ, మంగళవారాల్లో తొలిసారి సమావేశమైంది. సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పొలిట్ బ్యూరో నిర్ణయాలను బుధవారం వివరించారు. దేశంలో ధరల పెరుగుదల కోట్లాది మంది ప్రజల జీవనోపాధిని నాశనం చేసిందని అన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. ధరల పెరుగుదల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మతోన్మాద ధ్రువీకరణతో ప్రయత్నిస్తున్నదని ఏచూరి ఆరోపించారు. దేశంలో అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయనీ, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని తెలిపారు. అయితే పెట్రో ఉత్పత్తులు పెరుగుదలకు ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని సాకుగా చూపుతున్నారనీ, కానీ యుద్ధానికి ముందు నుంచే ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్లే పెట్రోల్ ఉత్పత్తల ధరలు పెరుగుతున్నాయని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం విధించే అన్నిరకాల సెస్‌లను రద్దు చేయాలనీ, అప్పుడే పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని అన్నారు. ఫలితంగా మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని అన్నారు.
బుల్డోజర్ పాలసీపై..
బుల్డోజర్ పాలసీ అంతర్జాతీయంగా ఉందని, అప్పుడు ఫాసిస్టు శక్తులు ఉపయోగించాయని అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ ఇదే పాలసీని ప్రయోగించిందని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో అదే జరుగుతుందని విమర్శించారు. కొందరిని లక్ష్యంగా చేసుకొని బుల్డోజర్లను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం దారుణమనీ, ప్రజల ఆస్తులను కూలగొట్టడం అమానవీయమైన చర్య అని విమర్శించారు. ఏదైనా ఆక్రమణలు జరిగుంటే.. దానికి నిబంధనలు ఉన్నాయని హితవు పలికారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే చర్యలు నడుస్తున్నాయనీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో ఇలాంటి ఘటనలు చూస్తున్నామని తెలిపారు. కూల్చడాన్ని న్యాయస్థానాలు తాత్కాలికంగా నిలుపుదల చేశాయనీ, అయితే ఈ అమానవీయ చర్యలను ప్రభుత్వం పూర్తిగా మానాలని హితవు పలికారు. ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలనీ, నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యూఏపీఏపై...
రాజద్రోహం చట్టంలానే చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కూడా ఉందని తెలిపారు. దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడే తాము వ్యతిరేకించామని అన్నారు. ఈ చట్టం కూడా దుర్వినియోగం అవుతుందని చెప్పారు. ఇందులో కూడా బెయిల్ కోసం అభ్యర్థించడానికి లేదని తెలిపారు. దీన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు యూఏపీఏని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి నిర్ణీత కాలపరిమితి విధించాలనీ, అలా చేయకపోవడం వల్ల యూఏపీఏ కింద ఎంతో మంది జైళ్లో మగ్గుతున్నారని అన్నారు. భీమా కోరేగాం కేసులో దాదాపు మూడేండ్లుగా జైల్లో ఉన్నారనీ, కానీ ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేయలేదని విమర్శించారు. ఉద్దేశ్యపూర్వంగానే చార్జ్‌షీట్ దాఖలు చేయటం లేదన్నారు. దేశంలో అసమ్మతి తెలపడాన్ని జాతి వ్యతిరేకంగా ప్రభుత్వం పరిగణిస్తోందని విమర్శించారు. ఇది సమర్థనీయం కాదన్నారు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి ముందు తెలుసుకోవాలి
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లక్ష్మణ రేఖ దాటొద్దని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఏచూరి ఆయనే ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగానికి ఎవరి సలహా అవసరంలేదని, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థల మధ్య అధికారాలపై రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. ఎవరి పరిధి వారిదేనన్నారు. కేంద్ర మంత్రి లక్ష్మణ రేఖ దాటొద్దంటే, ఏ ప్రాతిపదికన అంటున్నారో చెప్పాలని సూచించారు. ప్రభుత్వం, శాసన వ్యవస్థకు జవాబుదారీతనంగా ఉండాలని, పార్లమెంట్ సభ్యులు, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. అదే ప్రజల కోసం ప్రభుత్వమని, అదే పరిపాలనకు అర్థమని స్పష్టంచేశారు. ఇందులో లక్ష్మణ రేఖ ఎక్కడుందని ప్రశ్నించారు.
రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్షాల మధ్య చర్చ
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉమ్మడి అభ్యర్థి గురించి ప్రతిపాదన రావాలనీ, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనా రాలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయనీ, ఉమ్మడి అభ్యర్థి కోసం నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. కేరళలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కెవి థామస్ ఎల్డీఎఫ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఏచూరి అన్నారు. ఎన్నికల్లో ఎవరైనా ప్రచారం చేయొచ్చనీ, తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నామన్నారు. శ్రీలంకలో తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొందనీ, అక్కడి పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయని అన్నారు. అక్కడ ఏం జరుగుతుందో వేచి చూడాలనీ, మనకి చాలా ముఖ్యమైన సరిహధ్దు దేశం శ్రీలంక అని తెలిపారు. అక్కడి పరిస్థితులు చాలా కీలకమైనవని అన్నారు.