Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు బంధు, రైతు బీమా చుట్టే సర్కారు దృష్టి
- పత్తి, వరి, పామాయిల్ సాగుకేనా ప్రోత్సాహం?
- ప్రత్యామ్నాయ పంటలకు దిక్కేది?
- ముందుకొస్తున్న వానాకాలం
గుడిగ రఘు
అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగేయడంలేదు. గతేడాది కొనసాగిన పంటల ప్రతిష్టంభన ఈసారి కూడా కొనసాగేటట్టు కనిపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్యం రైతులను గందరగోళపరుస్తున్నది. గత అనుభావాల నుంచి పాఠాలు నేెర్చుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అదేదారిలో నడుస్తున్నది. వానాకాలం ముందుకొస్తున్నప్పటికీ అందుకనుగుణంగా సర్కారు వ్యవసాయ విధానాన్ని ప్రకటించలేదు. రైతు బంధు, రైతు బీమా, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తున్నట్టు పదేపదే చెబుతున్నది. అయితే రాష్ట్రంలో సమగ్రమైన వ్యవసాయ విధానానికి, దీర్ఘకాలిక పంటల ప్రణాళికకు ఇవి సరిపోవని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగడంలేదు. అయినా సర్కారు వాటి చుట్టే వ్యవసాయాన్ని తిప్పుతూ...రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నది. వరి, పత్తి, పామాయిల్ సాగుపై దృష్టి సారించినంతగా ఇతర పంటలను ప్రోత్సహించడం లేదనే విమర్శలున్నాయి. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలనీ, వాటిపై అవగాహన పెంచుకోవాలని మంత్రులు, అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను మాత్రం వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు అప్పగించడం, అధికారులు చేతులెత్తేయటం జరుగుతున్నది. దీంతో రైతులు సాంప్రదాయ పంటల నుంచి బయట పడలేకపోతున్నారనేది జగమెరిగిన సత్యం.
నిపుణుల సలహాలు తీసుకోరా?
వ్యవసాయంలోని స్వయం సమృద్ధి సాధించేందుకు సీఎం, మంత్రి, అధికారులు కేవలం కసరత్తు చేస్తేనే సరిపోదు. ఆ రంగంలో నిష్ణాతులైన నిపుణుల సలహాలు తీసుకోవాలి. కానీ, ఈ విషయంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. పెట్టుబడి సాయం అందచేయడంతో తమ పని అయిపోయిందనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పంటల లెక్కలు తీసేందుకు కొత్త యాప్, ఓలా, ఉబర్ క్యాబ్ తరహాలో రైతులకు యంత్రీకరణ సేవలు అందించాలంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వ్యవసాయ విధానంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ఇప్పటికే సర్కారు విఫలమైంది. బిందు, తుంపర సేద్యం, ట్రాక్టర్లు, చిన్న, చిన్న పరికరాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం లేదు. రైతులకు ఇలాంటి సహకారాన్ని అందించకపోవడంతో తగిన దిగుబడి రావడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు పామాయిల్ సాగును 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఎన్నో సాధకబాధకాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ 90శాతం సబ్సిడీతో పామాయిల్ సాగుకు సర్కారు శ్రీకారం చుట్టింది. పామాయిల్‌కు ఇస్తున్న ప్రచారంలో కనీసం సన్న, చిన్నకారు రైతులు సాగు చేస్తున్న కూరగాయలు, పాడి పరిశ్రమ, పప్పుధాన్యాలపై చేస్తే బాగుడేందని చెబుతున్నారు.
దిగుమతులను తగ్గించేదెలా?
రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలున్నాయి. సారవంతమైన నేలల్లో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు పండుతాయి. వీటిని ప్రోత్సహించడం లేదు. ప్రతి గుంటకు సాయిల్ టెస్టింగ్ కార్డులు అందజేస్తామంటూ సీఎం గొప్పగా ప్రకటించారు. ఏ నేలలో ఏ పంట వేయాలో, ఎంత దిగుబడి వస్తుందో, రైతుకు అవగాహన కల్పించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చునని కూడా సెలవిచ్చారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో మనం మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం. రవాణాచార్జీలు పోను అక్కడి రైతులకు పెద్దగా ప్రయోజనం లేదు. తెలంగాణ ప్రజలకు తక్కువ ధర కూరగాయలు అందడం లేదు. సరైన ధర వచ్చేదాకా వాటిని దాచుకునేందుకు అనువుగా కోల్డ్ స్టోరేజీలు, గోదాములు లేకపోవడంతో రైతులకు నష్టదాయకంగా మారింది. మధ్యదళారులు మాత్రం లబ్దిపొందుతున్నారు. వాణిజ్య పంటల పేరుతో ప్రభుత్వం 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని చెబుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ధర తగ్గితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నది. గతంలో పత్తి పెట్టి ప్రాణం మీదికి తెచ్చుకున్న సంఘటనలున్నాయి. అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు పాల్పడ్డారు. అందులో కౌలు రైతులు అత్యధికంగా ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తన పంథాను మార్చుకోవడం లేదని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
దీర్ఘకాలిక పంటల ప్రణాళికలు అవసరం
టి సాగర్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
వ్యవసాయ ప్రణాళికను రూపొందించడం, విడుదల చేయడం, వదిలేయడం అనే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దీర్ఘకాలిక పంటల ప్రణాళిక లేకపోవడంతో పంటల సమతుల్యత దెబ్బతింటున్నది. ఏ నేలలో ఏ పంట పండించాలి. ఏ పంటకు మద్దతు ధర ఎంత? వాటికి మార్కెట్ సౌకర్యం తదితర అంశాలపై రైతులకు భరోసా కల్పించాలి. కేరళ ప్రభుత్వం 16 రకాల పండ్లు, కూరగాయలకు మద్దతు ధర ప్రకటించింది. అదే తరహాలో అన్ని పంటలకు మన రాష్ట్రంలోనూ మద్దతు ధర ప్రకటించాలి.
గతేడాది గందరగోళమే
గతేడాది వానాకాలం, యాసంగిలో పంటల ప్రణాళిక ప్రకటించినప్పటికీ అధికారులు దాన్ని అమలు చేయలేదు. వానాకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు సాగు చేయాలని ప్రభుత్వం చెప్పింది. యాసంగిలో వరి వేస్తే ఉరి అంటూ ప్రచారం చేసింది. అందుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు పిలుపునిచ్చింది. వడ్లు కొనబోమంటూ షరతు పెట్టింది. ఇతర పంటల విషయంలో నిర్ధిష్టమైన ప్రణాళికను రూపొందించలేదు. ప్రకటించిన పంటలకు మద్దతు ధరను ప్రకటించలేదు. మార్కెట్ సౌకర్యంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ పంటల సాగు రైతులకు వదిలేసింది. వరి పంట పండే పొలాల్లోనూ ఆరుతడి పంటలు సాగు చేయడంతో అన్నదాతలు నష్టపోయారు. రైతులను గందరగోళ పరిచే విధానం కాకుండా దీర్ఘకాలికమైన పంటల ప్రణాళిక రూపొందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.