Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు ధరల పెంపుతో దిక్కుతోచని స్థితి
- అదనపు చలాన్లతో సర్కారు దోపిడీ
- పెరిగిన ధరలకు అనుగుణంగా పెరగని చార్జీలు
- ఆందోళనలో ఆటో కార్మికులు
- ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికుల డిమాండ్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
చమురు ధరల పెంపుతో ఆటో కార్మికుల బతుకులు ఛిద్రమైనవి. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలు పెరగకపోగా.. అదనంగా ప్రభుత్వం చలాన్ల పేరుతో పెనాల్టీలు వేసి కార్మికులను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తోంది. పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెంచడంతో ఆటో రంగం కుదేలైంది. రోజంతా ఆటో నడిపితే వచ్చే డబ్బులు ఆటో మెయింటెనెన్స్, ఫైనాన్స్‌కే సరిపోవడం లేదు. పైగా అదనపు పెనాల్టీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన యువత ఎక్కువ మంది ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తోంది. జిల్లాలో సుమారు 3లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఇందులో 60 శాతం మంది అద్దె ఆటోలు నడుపుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న సమయంలో కార్మికుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చాల్లింది. వరుసగా చమురు ధరలు పెరడంతో ట్రాన్స్‌పోర్టు రంగంపై కోలుకోలేని దెబ్బపడింది. దీంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లు ప్రభుత్వం వేసిన పెనాల్టీలు చెల్లించలేక ఆటోలను వదిలివేశారు.
కాటేదాన్ ప్రాంతానికి చెందిన మల్లేశ్ 20 ఏండ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాత ఆటో అమ్మి కొత్త ఆటో కొనుగోలు చేద్దామని ఆటో కన్సల్టెన్సీకి వెళ్లాడు. పాత ఆటోను అమ్మకానికి పెడితే రూ.లక్ష 10 వేలకు ధర నిర్ణయించారు. కానీ తన చేతికి అందింది మాత్రం రూ.10 వేలు మాత్రమే.. మిగతా రూ.లక్ష ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఫిట్నెస్ పెనాల్టీ కింద చెల్లించాల్సి వచ్చింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఫిట్నెస్ చార్జీలు రెగ్యూలర్‌గా చెల్లించకపోవడంతో ప్రభుత్వం అందిన కాడికి దోచుకుంది. కొత్త ఆటో కొందామని.. పాతదాన్ని తీసుకొని పోతే అసలులే లేకుండా పోయింది.
ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన నవీన్ ఐదేండ్లుగా ఆటో నడుపుతున్నారు. మూడేండ్లుగా కరోనాతో పెద్దగా ఆటోకు గీరాకీ లేక కుటుంబాన్ని కష్టతరంగా నెట్టుకొచ్చాడు. ప్రసుత్తం ప్రభుత్వం చమురు ధరలు పెంచడం, చలాన్ల వసూలు చేయడంతో ఫైనాన్స్‌లు చెల్లించలేక రోజురోజుకూ అప్పులు పెరుగుతున్నాయని ఆటో అమ్మాడు. అయినా ఫైనాన్స్ బకాయిలు తీరకపోవడంతో భార్య బంగారం తాకట్టు పెట్టి ఫైనాన్స్ క్లియర్ చేశాడు. ప్రస్తుతం దినసరి కూలీ పనులు చేస్తున్నాడు. ప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలు పెంచడంతోపాటు పెనాల్టీలు వసూలు చేయడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొద్దాంతా తిరిగినా గిట్టుబాటు లేదు
పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీల పెరగకపోవడం, దీనికి తోడు ఓలా, ఊబర్లు ఆటో కార్మికుల నడ్డి విరిచాయి. ప్రయాణికులు ఓలా, ఊబర్ల చార్జీల ప్రకారమే ఆటోలకు కూడా చెల్లిస్తుండటంతో కార్మికులకు గిట్టుబాటు అవడం లేదు. రోజుకు సుమారు రూ.1500 వస్తే.. అందులో పెట్రో, గ్యాస్ లేదా డీజల్ ఖర్చులు రూ.600 పోను, ఆటో మెయింటెనెన్స్ రూ.100, ఫైనాన్స్ రూ.300, అడ్డ చార్జీ రూ.100, డ్రైవర్ తిండి ఖర్చు రూ.100 ఇలా అన్నీ పోను రోజుకు రూ.300 నుంచి 400 మాత్రమే మిగులుతున్నాయి. పెరిగిన ధరలతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు కోరుతున్నారు.
పూట గడవడమే కష్టంగా ఉంది
ఆటో కార్మికుడు రాజు- రాజేందర్‌నగర్
పొద్దాంతా ఆటో తిప్పినా సాయంత్రానికి రూ.400 కూడా చేతికి వస్తలేవు. ఇంటి అద్దె చెల్లింపులకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ధరలను నియంత్రించాలి. ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలి.
పెనాల్టీలను రద్దు చేయాలి
రుద్రకుమార్- తెలంగాణ రోడ్డు ప్రయివేటు టాన్స్‌పోర్టు వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
పెరిగిన చమురు ధరలతో ఆటో కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. బతకడమే కష్టతరమైన పరిస్థితిలో ప్రభుత్వం పెనాల్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం శ్రేయస్కరం కాదు. తక్షణమే ఫిట్నెస్ పెనాల్టీల వసూలు పక్రియను వెనక్కి తీసుకోవాలి.