Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనగోళ్లలో మిల్లర్ల ఇష్టారాజ్యం
- క్వింటాల్‌కు 5 నుంచి 10 కేజీల కోత
- తరుగుకు అంగీకరించకపోతే కొర్రీలు
- కేజీ కూడా లెస్ లేదంటున్న అధికారులు
- రైతులకు మద్దతుగా తెలంగాణ రైతుసంఘం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఒక్క కేజీ కూడా కోత లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. దీనికి భిన్నంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నా చూసీచూడనట్టు ఉంటోంది. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రైతుకు ఎగుమతి దిగుమతితో ఎలాంటి సంబంధమూ లేదని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ప్రకటించినా మిల్లర్లు మాత్రం వదలడం లేదు. క్వింటాల్‌కు ఐదు నుంచి పది కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. కటింగ్‌కు అంగీకరిస్తేనే కొనుగోలు చేస్తున్నారని.. లేదంటే ఏదో ఒక కొర్రీ పెట్టి ఆలస్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం దెబ్బతింటుందనే భయంతో కటింగ్‌కు అంగీకరిస్తున్నామని చెబుతున్నారు. 17% ఉండాల్సిన తేమ 25%పైగా ఉన్నా ఎలాంటి కోత పెట్టడం లేదని, ఒకవేళ ఆ రకంగా కోత పెట్టినట్టు తమ దృష్టికి వస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ట్రక్ షీట్ కాకుండా తరుగుకు అంగీకరిస్తేనే..
ట్రక్‌షీట్‌తో సంబంధం లేకుండా తరుగుకు అంగీకరిస్తేనే కొనుగోళ్లు చేస్తామని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. తేమశాతం, నాణ్యత పేరిట పది కిలోల తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం తీసుకుంటున్నారు. గతంలో టిక్కీ ధాన్యం 41 కిలోలు ఉంటే 40 కిలోలకు డబ్బులు ఖాతాల్లో పడేవి. ఒక్క కిలో తరుగు తీసేవారు. ఇప్పుడు తొలుత 5 కిలోలు, మిల్లుల దగ్గర 10 కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 91 రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఖమ్మంలో 56, భద్రాద్రి కొత్తగూడెంలో 35 మిల్లుల్లో ధాన్యం తీసుకుంటున్నారు. కాంటా పూర్తయిన తర్వాత మిల్లులకు ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. అప్పుడు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యం సేకరణ పూర్తయ్యిందంటూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. తరుగుకు అంగీకరిస్తే ఒకలా.. లేదంటే మరోలా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధాన్యాన్ని కూడా తీసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు. రోజుల తరబడి మిల్లుల వద్ద పడిగాపులు కాయలేక రైతులు తెగనమ్ముకుంటున్నారు.
మిల్లుల దగ్గర వాహనాల బారులు
ఉమ్మడి జిల్లాలో ఏ మిల్లు వద్ద చూసినా వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి. మూడు నుంచి వారం రోజుల పాటు పడిగాపులు కాయాల్సి వస్తుండటంతో ఆర్థికంగా రైతులకు భారం అవుతోంది. నేలకొండపల్లి మండలం పైనంపల్లి, ఇటు కొణిజర్ల మండలం లాలాపురం, తల్లాడ మండలంలో పలుచోట్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. కొణిజర్ల మండలం లాలాపురంలో గురువారం ఓ మిల్లు వద్ద సుమారు వంద లారీలు, వంద ట్రాక్టర్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఏ మిల్లు వద్ద చూసినా కనీసం 50కి తగ్గకుండా వాహనాలుంటున్నాయి.
అధికారులు చెప్పినా అంతే..
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులు సూచిస్తున్నా.. మిల్లులను సందర్శించి ఆదేశాలు ఇస్తున్నా.. మిల్లర్లు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తల్లాడ మండలంలోని మిల్లులను అదనపు కలెక్టర్ మధుసూదన్ గురువారం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తరుగు పేరుతో దగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు నెలరోజులు కావస్తోంది. మొత్తం 236 కేంద్రాలను తెరవాలని నిర్ణయించినప్పటికీ మే 11వ తేదీ నాటికి 216 కేంద్రాలను మాత్రమే తెరిచారు. వీటిలో 125 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 3,943 మంది రైతుల నుంచి 31,985.320 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1681 మెట్రిక్ టన్నులు ఎంటర్ చేయగా, వివిధ దశల్లో ఇంకా 838 మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. జూన్ నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో 2,42,896 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ కొనుగోళ్లు ప్రారంభమై నెల కావస్తున్నా సవాలక్ష కొర్రీల మధ్య ఇంకా 31,985 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.
క్వింటాకు 7 కేజీల తరుగు తీశారు
ధాన్యం కాంటా వేసి మిల్లుకు తరలించిన తర్వాత క్వింటాకు 7 కేజీల తరుగు తీశారు. కుర్నవల్లి కొనుగోలు కేంద్రం నుంచి 75 మంది రైతులు ధాన్యం విక్రయించారు. వారందరి దగ్గర ఇదే విధంగా కోత పెట్టారు. ఈ విషయాన్ని సొసైటీ చైర్మెన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మాకు తెలియదంటే మాకు తెలియదంటూ తప్పించుకుంటున్నారు. జిల్లా అధికారులు ఈ విషయమై దృష్టి సారించి కటింగ్ లేకుండా ఖాతాల్లో నగదు జమయ్యేలా చూడాలి.
- బొగ్గుల లింగారెడ్డి, కుర్నవలి,తల్లాడ మండలం
అధికారులు చొరవ తీసుకోవాలి
ధాన్యం కటింగ్, కొనుగోళ్ల విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలి. క్వింటాల్‌కు పది కేజీల చొప్పున తరుగు పేరుతో తీస్తుండటం మరీ దారుణం. కేజీ కూడా తరుగు లేకుండా చూస్తామన్న ప్రభుత్వం నిద్రాణంగా ఉండటం సరికాదు. రైతుకు ఎగుమతి, దిగుమతితో సంబంధం లేదంటూనే.. మిల్లుల వద్ద కొర్రీలు పెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీనిపై దృష్టి సారించాలి.
- బొంతు రాంబాబు,
తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి.