Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొద్దుగాల తెరుచుకోని సర్కారు డయాగస్టిక్ సేవలు
- బయట పరీక్షలతో ఆర్థిక భారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షల కోసం పాటిస్తున్న పని వేళలు ప్రయివేటు ఆస్పత్రులకు వరంగా మారాయి. ముఖ్యంగా డయాగస్టిక్ సెంటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పరిగడుపున చేసుకోవాల్సిన పరీక్షల కోసం పొద్దెంకంత వరకు ఎదురు చూడలేక ప్రయివేటుకు రోగులకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా కార్పోరేటు, ప్రయివేటు సెంటర్లు పేదలను దోపిడీ చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న పేదలపై పరీక్షల పేరుతో పేదలపై మరింత భారం పడుతున్నది......ఆధునిక వైద్యశాస్త్రంలో రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక స్థానం ఉన్నది. పలు రకాల రోగాలు చుట్టుముడుతుండటంతో వ్యాధి కచ్చితంగా తెలిస్తేనే డాక్టర్లు చికిత్స మొదలు పెడుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలకు పెరిగిన గిరాకీని ద ృష్టిలో ఉంచుకుని కార్పొరేట్, ప్రయివేటు దోపిడీకి తెరలేపాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రధాన పట్టణాల్లో శాఖోపశాఖలుగా విస్తరించాయి. అయితే అవి విధిస్తున్న ధరలు పేదలకు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ డయాగస్టిక్ సెంటర్లు లేదా తక్కువ ధరకు దొరికే ప్రయివేటు చిన్న చిన్న డయాగస్టిక్ సెంటర్లను ఆశ్రయించారు. అయితే పేదలెదుర్కొంటున్న ఈ పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ ఈ సేవలను విస్తరించింది. బస్తీ దవాఖానాల్లో సైతం నమూనాలను సేకరిస్తున్నారు. దీంతో చాలా రకాల పరీక్షలకు ప్రయివేటుకు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి పేదలకు బాధ తప్పింది.అయితే పరీక్షల్లో కొన్ని ఉదయం భోజనం చేయకముందే చేసుకోవాల్సిన టెస్టులుంటాయి. ఆ టెస్టుల విషయంలో మాత్రం ప్రభుత్వాస్పత్రుల్లో ఉదయం సేవలు దొరకకపోవడంతో ప్రయివేటునే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్ తదితర పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలను చేసుకునేందుకు బస్తీ దవాఖానాలకు వెళితే ఉదయం తొమ్మిది దాటితే తప్ప నమూనాలు సేకరించే పరిస్థితి లేదు. అంతసేపు రోగులు వేచి చూడలేక ప్రయివేటులోనే పరీక్షలు చేయించుకున్నారు. నమూనాల సేకరణ సమయాన్ని ఉదయం నుంచే మొదలుపెడితే ప్రయోజనం ఉంటుందని రోగులు కోరుతున్నారు. తద్వారా ప్రయివేటుకెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడే అవసరముందని చెబుతున్నారు.
తక్కువ మంది సిబ్బంది ఉండటమే సేవల సమయాన్ని పొడిగించకపోవడానికి కారణమని సమాచారం. అదే సమయంలో ప్రయివేటు డయాగస్టిక్ సేవలు మాత్రం ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభం కావడం గమనార్హం. ప్రయివేటు నుంచి ఎదురవుతున్న ఈ పోటీని తట్టుకునేందుకు, పేద రోగులను ఆదుకునేందుకు మరింత మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించుకొని షిప్ట్ సిస్టమ్ లో సేవలందిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.