Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారని ఇంటర్ బోర్డు తీరు
- ప్రశ్నాపత్రాల్లో వస్తున్న తప్పులు
- ఇంగ్లీష్, తెలుగు మాధ్యమం వారికి వేర్వేరు ప్రశ్నలు
- ఇంటర్ సెకండియర్ పొలిటికల్ సైన్స్ విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాల్లో తప్పుల పరంపర కొనసాగుతున్నది. అయినా ఇంటర్ బోర్డులో ఎలాంటి కదలిక లేదు. పరీక్షల నిర్వహణ పట్ల, విద్యార్థుల జీవితాల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రతిరోజూ ఏదో ఒక తప్పు ప్రశ్నాపత్రంలో రావడం గమనార్హం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నది. రోజూ తప్పులు వస్తున్నా ఇంటర్ బోర్డు తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారులు మాత్రం ఏమీ జరగనట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పొలిటికల్ సైన్స్ (సివిక్స్) పేపర్-2 ప్రశ్నాపత్రంలో తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమం విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నలు రావడం గమనార్హం. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంగ్లీష్ మీడియం ప్రశ్నాపత్రంలో ఐదు మార్కులకు చెందిన ఎనిమిదో నెంబర్ ప్రశ్న 'పాయింట్ అవుట్ ది మెయిన్ ప్రావిజన్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947' అని ముద్రించింది. అదే తెలుగు మాధ్యమం ప్రశ్నాపత్రంలో అదే ప్రశ్నను 'భారత స్వాతంత్య్ర పోరాటంలో హోమ్రూల్ ఉద్యమాన్ని వర్ణించండి'అన్న ప్రశ్న వచ్చింది. ఇలా ఒకే కోర్సు చదివే విద్యార్థులకు వేర్వేరుగా ప్రశ్నలు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదంలో తప్పు జరిగిందా? లేక ప్రశ్ననే వేర్వేరుగా అడిగారా? అన్నది తెలియాల్సి ఉన్నది. అన్ని ప్రశ్నాపత్రాలనూ ఇంగ్లీష్ మాధ్యమంలో తయారు చేసి దాన్ని తెలుగు, ఉర్దూ మాధ్యమంలోకి ఇంటర్ బోర్డు అనువాదం చేసి ముద్రిస్తున్నది. కానీ పొలిటికల్ సైన్స్ పేపర్-2 ప్రశ్నాపత్రంలో వేర్వేరు ప్రశ్నలు అడగడం ఇంటర్ బోర్డు తప్పిదానికి నిదర్శనం.
వరుసగా ఇంటర్ బోర్డు తప్పులు...
ఇంటర్ పరీక్షలు ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇంటర్ బోర్డు వరుసగా తప్పులు చేస్తూనే ఉన్నది. ఈనెల ఆరో తేదీన జరిగిన సెకండ్ లాంగ్వేజీ పేపర్-1 పరీక్షలో సంస్కృతం ప్రశ్నాపత్రంలో పలు ప్రశ్నలు పునరావృతం కావడం గమనారం. ఒక బిట్లో ఒక ప్రశ్న, మరో బిట్లో రెండు ప్రశ్నలు మొత్తంగా మూడు ప్రశ్నలు తిరిగి అవే పునరావృతం కావడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. 12వ బిట్లోని రెండు, 11వ ప్రశ్నలు, 13వ బిట్లో ఒకటి, 12వ ప్రశ్నలు, అలాగే రెండు, 11వ ప్రశ్నలు పునరావృతమయ్యాయి. ఈనెల ఏడో తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 తెలుగు ప్రశ్నాపత్రంలోనూ రెండు తప్పులు దొర్లాయి. ప్రత్యేకత అనే పదానికి బదులుగా ప్రత్యేక అని వచ్చింది. మరో ప్రశ్నలో చినుకులు అనే పదానికి బదులుగా చినుకుల అని ప్రచురితమైంది. అదేరోజు నిర్వహించిన ఉర్దూ ప్రశ్నాపత్రంలో గుల్డాన్ అని రావాల్సి ఉండగా, గుల్డన్ అని వచ్చింది. ఈనెల తొమ్మిదో తేదీన కోదాడలో సిటీ సెంట్రల్ పరీక్షా కేంద్రంలో హిందీ ప్రశ్నాపత్రానికి బదులు కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం రావడం సంచలనం సృష్టించింది. దీంతో గంటంపావు ఆలస్యంగా కోదాడలోని ఇతర పరీక్షా కేంద్రాలు, సూర్యాపేట నుంచి హిందీ ప్రశ్నాపత్రాలు తెప్పించి పరీక్ష రాయించడం గమనార్హం. ఈనెల 11వ తేదీన పొలిటికల్ సైన్స్ (సివిక్స్) పేపర్-1 హిందీ మాధ్యమంలో ప్రశ్నాపత్రాన్ని ముద్రించి ఇవ్వకపోవడం ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఇంగ్లీష్ మాధ్యమంలోని ప్రశ్నాపత్రాన్ని హిందీలోకి అనువాదం చేసి చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు అందించడం గమనార్హం. రెగ్యులర్ లెక్చరర్లు లేని కారణంగా ప్రశ్నాపత్రాలు ముద్రించలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. కాలేజీకి గుర్తింపు ఇచ్చి, విద్యార్థులతో ఫీజు తీసుకుని ప్రశ్నాపత్రం ముద్రించి ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఆ ప్రశ్నకు జవాబు రాస్తే మార్కులు కలుపుతాం : జలీల్
ఇక గురువారం జరిగిన పొలిటికల్ సైన్స్ పేపర్-2లో ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో వేర్వేరు ప్రశ్నకు జవాబు రాసిన విద్యార్థులకు మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్లో ఏడుగురు, నాగర్కర్నూల్లో నలుగురు విద్యార్థులను మాల్ ప్రాక్టీస్ కేసుల కింద నమోదు చేశామని పేర్కొన్నారు. గురువారం పరీక్షకు 21,876 (4.9 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు.