Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐటీ, ఎంజీఐటీపై టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం
- 2016-19 బ్లాక్ పీరియడ్‌కు ఫీజు ఖరారు
- సీబీఐటీకి రూ.1.40 లక్షలు, ఎంజీఐటీకి రూ.1.20 లక్షలు
- 2016 నుంచి న్యాయస్థానాల్లో నలిగిన సమస్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆ విద్యార్థులు ఇంజినీరింగ్ చదువును పూర్తి చేశారు. పట్టా పొందారు. వాళ్లు ఇప్పుడు విదేశాల్లో, ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తూనో, ఉద్యోగాలు చేస్తూనో ఉన్నారు. చదువు పూర్తయిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఖరారు చేయడం గమనార్హం. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ), మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) కాలేజీల్లో 2016-17, 2017-18, 2018-19 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజులు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సీబీఐటీ ఫీజును రూ.1,13,500 నుంచి రూ.1,40,000, ఎంజీఐటీ ఫీజును రూ.1,00,000 నుంచి రూ.1,20,000గా టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. గురువారం హైదరాబాద్‌లో టీఏఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం జరిగింది. ఆయా కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూ టీఏఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు, సీబీఐటీ, ఎంజీఐటీల యాజమాన్యం సంతకాలు చేశాయి. దీంతో ఐదేండ్లుగా కోర్టుల్లో నలుగుతున్న ఫీజుల సమస్య పరిష్కారమైంది. 2016-17, 2017-18 విద్యాసంవత్సరాల్లో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల చదువులు పూర్తయ్యాయి. 2018-19 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు ప్రస్తుతం (2021-22) నాలుగో ఏడాది చదువుతున్నారు. చదువులు పూర్తయి, సర్టిఫికెట్లు కాలేజీ నుంచి తీసుకెళ్లిన విద్యార్థులు అదనపు ఫీజు ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్ధకంగా ఉన్నది. ఇంకోవైపు అదనపు ఫీజుకు సంబంధించిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆ కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థులే ఎక్కువ ఫీజు చెల్లించి ఉంటే దాన్ని వారికి కాలేజీల యాజమాన్యాలు ఇవ్వాలి.
ఇదీ ఫీజు వివాదం...
సీబీఐటీ ఫీజు 2016-19 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి రూ.1,13,500గా, ఎంజీఐటీ ఫీజు రూ.లక్షగా టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. ఆ ఫీజు అంగీకారమేనని సీబీఐటీ అప్పటి అధ్యక్షుడు వి మాలకొండారెడ్డి 2016, మే 6న టీఏఎఫ్ఆర్సీ వద్ద సంతకం చేశారు. అయితే టీఏఎఫ్ఆర్సీ తనను బలవంతం చేసి సంతకం చేయించిందంటూ 2016, జులై 10న హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఆదాయ, వ్యయాల ఆధారంగా రూ.2,59,867 ఫీజు నిర్ణయించాలని కోర్టుకు వివరించారు. ఈ అంశాలపై రికార్డులు సమర్పించాలని టీఏఎఫ్ఆర్సీని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత వాసవి, శ్రీనిధి కాలేజీ యాజమాన్యాలూ కోర్టును ఆశ్రయించాయి. సీబీఐటీకి ఫీజు రూ.1,13,500 నుంచి రూ.రెండు లక్షలకు, ఎంజీఐటీ ఫీజు రూ.లక్ష నుంచి రూ.1.60 లక్షలు, వాసవి కాలేజీ ఫీజు రూ.97 వేల నుంచి రూ.1.60 లక్షలు, శ్రీనిధి కాలేజీ ఫీజు రూ.97 వేల నుంచి రూ.1.37 లక్షల వరకు ఫీజులను పెంచాలని 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీఏఎఫ్ఆర్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన దాని ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన జీవోనెంబర్ 21ని అనుసరించి ఆయా కాలేజీలు ఫీజులను వసూలు చేయాలని 2019, అక్టోబర్ 29న సుప్రీం తీర్పునిచ్చింది. ఒకవేళ అభ్యంతరం ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే సీబీఐటీ, ఎంజీఐటీ యాజమాన్యాలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించాయి. వాటి ఫీజులను పున:పరిశీలించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో టీఏఎఫ్ఆర్సీని కోర్టు ఆదేశించింది. దాని ప్రకారం టీఏఎఫ్ఆర్సీ కమిటీ మూడుసార్లు సమావేశమై సీబీఐటీ ఫీజును రూ.1,13,500 నుంచి రూ.1,40,000కు, ఎంజీఐటీ ఫీజును రూ.లక్ష నుంచి రూ.1,20,000 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ఫీజు పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపునకు అవకాశముంటుంది. లేదంటే పాత ఫీజు రూ.1,13,500ను మాత్రమే ప్రభుత్వం చెల్లించే ప్రమాదమున్నది. అయితే 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు సంబంధించి బ్లాక్ పీరియర్ సీబీఐటీ ఫీజు రూ.1.34 లక్షలు, ఎంజీఐటీ ఫీజు రూ.1.08 లక్షలను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. ఈ ఫీజులపై ఆయా కాలేజీల యాజమాన్యాలు అభ్యంతరం చెప్పలేదు. అందుకే వాటిపై కోర్టును ఆశ్రయించలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుపై ఎలాంటి ఇబ్బంది లేదు.
సంతోషకరం... విచారకరం : టీపీఏ
హైకోర్టు ఆదేశాల మేరకు 2016-17 నుంచి 2018-19 బ్లాక్ పీరియడ్‌కు సీబీఐటీ ఫీజు రూ.1.40 లక్షలు, ఎంజీఐటీ ఫీజు రూ.1.20 లక్షలు నిర్ణయించడం సంతోషకరం, విచారకరమని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) తెలిపింది. ఈ మేరకు టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ పద్మారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు సమస్య ఆయా కాలేజీల యాజమాన్యం కోరిన దానికంటే తక్కువ ఫీజు ఖరారు కావడం సంతోషించే విషయమని పేర్కొన్నారు. ఖరారైన ఫీజు కంటే ఎక్కువ చెల్లించిన విద్యార్థులకు అదనపు ఫీజు మొత్తం తిరిగి ఆయా యాజమాన్యం చెల్లిస్తుందని తెలిపారు. దీంతో సర్టిఫికెట్ల కోసం వేచి ఉన్నవారు నిర్ణయించిన ఫీజు చెల్లించి వాటిని తీసుకోవచ్చని సూచించారు. సీబీఐటీ, ఎంజీఐటీ తల్లిదండ్రుల సంఘం చేసిన పోరాటాలతో వచ్చిన ఈ ఫలితం మంచి విజయమేనని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలిపారు.