Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టూరిజం ఎండీ, జీఎంపై ఏసీబీకి ఫిర్యాదు
- ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దంటూ లంచం ఇవ్వజూపారు
- రూ.300 కోట్ల పీపీపీ ప్రాజెక్టులపై నోరు మెదపొద్దని కోరారు: బక్క జడ్సన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పర్యాటకశాఖలో నెలకొన్న అవినీతి భాగోతంపై ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ బట్టబయలు చేశారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ రావు, జనరల్ మేనేజర్ శాంతిపై ఆయన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు. టూరిజంలో పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించిన రూ.300 కోట్ల విలువైన లీజులకు సంబంధించిన అవినీతి గురించి విలేకరుల సమావేశంలో తాను మాట్లాడకుండా ఉండేందుకు లంచంతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. లీజ్ రెంటల్స్ కు సంబంధించి తాను ఇది వరకే సీఎం కేసీఆర్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విజిలెన్స్ డీజీ అంజనీకుమార్ కు జనవరి 24న ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యదర్శులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డిలకు ఏప్రిల్ 6, 28 తేదీల్లో ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశానని తెలిపారు. ఫలితం లేకపోవడంతో ఏప్రిల్ 28న మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పీపీపీ ప్రాజెక్టుల లీజుల వ్యవహారంపై మాట్లాడేందుకు సిద్ధపడినట్టు జడ్సన్ వివరిం చారు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ముందు ముగ్గురు వ్యక్తులు తన వద్దకు వచ్చి తాము టూరిజం ఎండీ, జీఎం తరపున వచ్చామని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దంటూ కోరారని తెలిపారు. దానికి బదులు గా తనకు, తన కుటుంబానికి రాష్ట్రంలోని అన్ని హరిత హౌటళ్లలో వసతి, ఆహారం, లగ్జరీ కారును ఆఫర్ చేశారని చెప్పారు. అయితే తాను అమ్ముడుపోవడానికి వస్తువును కాదని తిరిగి పంపిం చేశాననీ, అయితే వారు మూడు ఫోన్ నెంబర్లనిచ్చి అందులో మొదటిది శాంతిదంటూ, ఎప్పుడైన సంప్రదించవచ్చని తెలిపారన్నారు. లోతుగా పరిశీలిస్తే ఆర్థిక వ్యవహారాల్లో మనోహర్ రావుకు, కాంట్రాక్టర్లకు మధ్యలో శాంతి కలెక్షన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నదని బక్క జడ్సన్ చెప్పారు.