Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడకొస్తే డబుల్ ఇంజిన్ పాలన ఏంటో చూపిస్తాం : గోవా సీఎం ప్రమోద్ సావంత్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో కంటే తమ రాష్ట్రంలోనే ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గోవా సీంఎ ప్రమోద్ సావంత్ అన్నారు. తమ రాష్ట్రానికి వస్తే డబుల్ ఇంజిన్ పాలన అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వితంతు పింఛన్, కళ్యాణలక్ష్మి, రైతులకు వడ్డీలేని రుణాలు ఇక్కడి కంటే మెరుగ్గా అమలు చేస్తున్నామన్నారు. పనులు, పథకాల అమలు తీరు కోసం పంచాయతీల్లో గెజిటెడ్ అధికారులు ప్రతి వారం పర్యటిస్తున్నారని చెప్పారు. దేశంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారని కొనియాడారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకుగానూ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బాగా పనిచేశారని ప్రశంసించారు. విజయవంతంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజరుకి అభినందనలు తెలిపారు. డబుల్ ఇంజిన్ పాలన అన్ని రాష్ట్రాల్లో రావాలనే లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామని చెప్పారు. దేశంలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేశామన్నారు. టూరిస్టులకు కూడా కరోనా వ్యాక్సిన్లు వేయించిన ఘనత తమ రాష్ట్రానికి దక్కుతుందన్నారు. ఆయూష్ అభివృద్ధి కోసం జైపూర్‌లో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం మంచిపరిణామం అన్నారు.
14న అమిత్‌షా రాక
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర-2 ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 14న కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళతారు. తదనంతరం శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు తుక్కుగూడలో జరిగే ప్రజాసంగ్రామ యాత్ర సభలో పాల్గొంటారు. రాత్రి 8:30 తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.