Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వలసపాలకుల నాటి రాజద్రోహ చట్టం(ఐపీసీ సెక్షన్ 124 ఏ) అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మానవహక్కులు ప్రశ్నార్థం కావడం సరైంది కాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య వ్యాఖ్యానిం చారు. సెక్షన్ 124 ఏ మూలంగా జర్నలిస్టులు, ప్రజాసంఘాల కార్యకర్తలు, విద్యార్థులు దౌర్జన్యానికి గురవుతున్నారనీ, ఇది కొనసాగితే దేశంలో విపరీతపరిణామాలు ఉత్పన్నమయ్యే ప్రమాద ముందని అన్నారు. ఈ చట్టాన్ని స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడం కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఈ చట్టం మూలంగా వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛ ప్రశ్నార్థకమవు తున్నాయని అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఈ చట్టం కింద కేసులు మోపబడ్డ 13 వేల మంది జైళ్లల్లో మగ్గుతున్నారనీ, రాష్ట్రంలోనూ జర్నలిస్టులు బాధితుల య్యారని చెప్పారు. రాజద్రోహ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దుచేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.