Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపం ప్రకటించిన ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, పలువురు నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రొడ్డ అంజయ్య హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మరణించారు. ఆయన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం. ఆయనకు భార్య రాములమ్మ, కొడుగు భగత్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సంగారెడ్డిలో బుధ, గురువారాల్లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయనకు షుగర్, బీపీ లెవల్స్ పెరగడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందే క్రమంలోనే పరిస్థితి విషమించి చనిపోయారు. నిమ్స్ ఆస్పత్రిలో ఆయన భౌతికకాయాన్ని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బొప్పని పద్మ తదితరులు సందర్శించారు. నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో చౌటుప్పల్ మండలంలో విద్యార్థి యువజన, వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో రొడ్డ అంజయ్య చురుగ్గా పాల్గొన్నారు. పేదలను సమీకరించి భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు ఆడపిల్లలున్నారు.
ఆయన మరణం పీడిత ప్రజల ఉద్యమాలకు తీరని లోటు
రొడ్డ అంజయ్య మృతి పీడిత ప్రజల ఉద్యమానికి తీరని లోటు అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య ఆర్.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, బొప్పని పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.