Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్
- మన చరిత్ర మనం తెలుసుకోవాలి : కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈనాటి విద్యార్థులే రేపటి తరానికి చరిత్ర అందించే రచయితలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. విద్యార్థులు తమ ఊరు భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక విశిష్టతలు తెలుసుకోవాలన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన సెమినార్ను గౌరీశంకర్ ప్రారంభిం చారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు చరిత్ర ఐక్యూ ఏసీ ఆధ్వర్యంలో 'మన ఊరు- మన చరిత్ర- మన చరిత్రను మనమే రాసుకుందాం' అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మన ఊరు ఎలా పుట్టింది, ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలపై పరిశోధన చేయాలన్నారు. తెలంగాణలోని ప్రతి ఊరుకూ ఓ చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల గురించి ఇప్పటి వరకు చరిత్రకారులకు దొరకని అంశాలను, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని రికార్డు చేయాలని చెప్పారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ విశిష్ట గ్రంథాలను వెలువరిస్తుందని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. మన చరిత్ర మనం తెలుసుకోకపోతే మన ఉనికిని మనం కోల్పోయినట్టేనని చెప్పారు. మన చుట్టూ ఉన్న సమాజంలోని భిన్న అంశాల రూపకల్పనే చరిత్ర అన్నారు. వందేండ్లకు పూర్వం ఉన్న మన పూర్వీకుల చరిత్ర మనకు తెలియదని, ఈ కార్యక్రమం ద్వారా అటువంటి అవకాశం లభించిందని చెప్పారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన త్రైమాసిక పత్రిక 'పునాస', కళాశాల తెలుగు విభాగం, రాజనీతి శాస్త్రం విభాగం రూపొందించిన మరో రెండు గ్రంథాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలుగు శాఖ అధిపతి డాక్టర్ జె.రమేష్, చరిత్ర శాఖాధిపతి నాగూర్, కార్యక్రమ సమన్వయకర్త, కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ సీతారాం, ఐక్యూ ఏసీ సమన్వయకర్త డాక్టర్ ఏఆర్ సత్యవతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, వివిధ విభాగాల అధ్యాపకులు, ఖమ్మంలోని మహిళా, ప్రియదర్శిని, డీఆర్ఎస్, గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.