Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదగిరిగుట్ట డిపోలో ఘటన
- ఆర్టీసీ అధికారుల వేధింపులే కారణం..!
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
కొద్ది రోజుల్లో రిటైర్ అవ్వాల్సిన ఆర్టీసీ డ్రైవర్ అధికారుల వేధింపులకు తాళలేక టైర్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపోలో బుధవారం రాత్రి జరిగింది. కార్మికులు, స్థానికులు తెలిపిన వివారాల ప్రకారం..
యాదగిరిగుట్ట డిపోలో మిర్యాల కిషన్(60) 1996 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెలాఖరులో రిటైర్ అవ్వాల్సి వుంది. అనారోగ్య కారణాలతో సిక్ లీవ్ పెట్టినా అధికారులు మంజూరు చేయలేదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అయినా విధులకు హాజరయ్యారు. బుధవారం రాత్రి 10:30గంటల సమయంలో డిపోలోని బంక్‌లో బస్సు డీజిల్ నింపుకుని వెళుతుండగా ఒక్కసారిగా కిషన్ టైరు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అకస్మాత్తు పరిణామంతో బస్సును ఆపడం డ్రైవర్‌కు సాధ్యపడలేదు. దీంతో టైరు కిషన్‌పై నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కిషన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు యాదగిరిగుట్ట బస్ డిపోకు చేరుకున్నారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.