Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్వారావుపేటలో సందర్శన
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయ పంటగా పామ్ ఆయిల్ సాగు పెంచాలనే పాలకుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం యంత్రాం గాలు ప్రణాళికలు రూపొందిస్తు న్నాయి. ఈ క్రమంలో పామ్ ఆయిల్ సాగు, విస్తీర్ణం, నూనె తయారీ, వీటిల్లో ఆయిల్ ఫెడ్ - ప్రభుత్వం రైతులకు అందించే సేవలపై అధ్యయనం చేసేందుకు నాబార్డ్ అధికారులు అశ్వారావుపేటలో పర్యటించారు. ఆ సంస్థ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, నల్లగొండ జిల్లాల డిడిఎం (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్లు)లు సుజిత్ కుమార్, మిర్యాల వినరుకుమార్‌ను ఆయిల్ పామ్ సాగు అనుబంధ రంగాలపై అధ్యయనం (అగ్రికల్చర్ వాల్యూ చైన్ ఫైనాన్సియల్ స్టడీ) నిమిత్తం ప్రభుత్వం నియమించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పామ్ ఆయిల్ నర్సరీలను, సాగు క్షేత్రాలను, నూనె తయారు చేసే పరిశ్రమలను వారిరువురు గురువారం సందర్శించారు. ముందుగా అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం పరిధిలో గల ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో ఎడిహెచ్, ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదరు కుమార్‌తో సమావేశమయ్యారు. విత్తనం దిగుమతి, మొక్కల తయారీలో నర్సరీల నిర్వహణ, రైతులకు రాయితీలపై చర్చించారు. అనంతరం వారు నవతెలంగాణతో మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయ పంటగా పామ్ ఆయిల్ పంటను రైతులు ఎంచుకుంటే నాబార్డ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం (ఆర్థిక సంస్థలు) బ్యాంక్‌ల ద్వారా రైతులకు సేవలు ఎలా అందించాలో పరిశీలిస్తామన్నారు. ఈ సాగు ఏ దశలో ఏ విధమైన రాయితీలు ఇవ్వాలి, రుణం అందజేసిన అనంతరం తిరిగి నాబార్డ్ ఎలా పొందాలి అనే అంశాలపై నివేదిక రూపొందించడానికి అధ్యయనం కోసం వచ్చామని తెలిపారు. ఆయిల్ పామ్‌లో అనుబంధ రంగాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి నాబార్డ్‌కు నివేదిక అందిస్తామని చెప్పారు.