Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగుల సహాయకులకు భోజన సౌకర్యం
- త్వరలో నైట్‌షెల్టర్లు కూడా అందుబాటులోకి.. : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
- ఉస్మానియా ఆస్పత్రిలో రూ.5కు రోగుల సహాయకులకు భోజనం ప్రారంభం
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్రంలో పేదలు ఆకలితో ఉండొద్దు, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని 18 ఆస్పత్రుల్లో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి రోగుల సహాయకులకు రూ.5కే మూడుపూటలా భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల సహాయకులకు రూ.5కు భోజన వసతి కార్యక్రమాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పేదల ఆకలి తీర్చేందుకు మనిషికి ఆరు కిలోల చొప్పున అందరికీ భోజనం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు. ఒక్కో నెల రోగి సహాయకుల కోసం రూ. 40 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. దీనివల్ల రోజుకి కనీసం 20 వేల మంది లబ్ది పొందుతారని చెప్పారు. ప్రతి భోజనంపై ప్రభుత్వం హరే రామ హరే కృష్ణ సంస్థ వారికి రూ.21 ఇస్తోందన్నారు. హరేరామ హరేకృష్ణ... పేదల కోసం నిస్వార్థంగా పనిచేసే సంస్థ అని ప్రశంసించారు. వీలైనంత త్వరగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సహాయకుల కోసం నైట్ షెల్టర్లను కూడా ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. రోగుల డైట్ చార్జీలను పెంచుతున్నామని, ప్రస్తుతం రూ.56 ఉండగా 11 చేశామని తెలిపారు. దీనివల్ల రూ.43 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందన్నారు. ప్రభత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్ కోసం బడ్జెట్లో రూ.338 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.2679 కోట్లతో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి ఇటీవల 75 ఐసీయూ పడకలను మంజూరు చేయగా.. గురువారం 40 పడకలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మరో రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఉస్మానియా మార్చురీ ఆధునీకరణకు రూ.6 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆర్థోపెడిక్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. ఎన్ఏబీహెచ్ కింద ఉస్మానియాకు మరో 10 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. పర్యావరణ సంబంధ ఇబ్బందులు లేకుండా కొత్త బ్లాక్ నిర్మాణం చేపడతామన్నారు. హెరిటేజ్ కమిటీ రిపోర్ట్ రాగానే సీఎం దృష్టికి తీసుకువెళ్లి కొత్త బ్లాక్ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఉస్మానియాతోపాటు గాంధీ ఆస్పత్రిలో, ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో రూ.5కే భోజన వసతి పథకాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.