Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైౖతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
గ్రామాల్లో నెలకొన్న ప్రజాసమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించి పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ కోరారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. మిడ్జిల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పది గ్రామాల్లో మూడు రోజులపాటు సమగ్రంగా సర్వే చేశామని చెప్పారు. వెలుగోమూల గ్రామంలో సర్వే నెంబర్ 147లో 18 ఎకరాల మన్యం భూమిని దళితులు సాగు చేసుకుంటున్నారని, వారికి వెంటనే ఓఆర్సి ఇచ్చి పట్టాలు జారీ చేయాలని కోరారు. అయ్యవారిపల్లిలో సర్వేనెంబర్ 292 / 2లో దళితులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని తెలిపారు. వెంటనే ఆ కబ్జాని విడిపించి దళితులకు ఇవ్వాలని కోరారు. వల్లభరావుపల్లిలో 60 ఏండ్ల కిందట దళితులకు 225 ఎకరాల అసైన్డ్ భూమిని ఇచ్చారని, సాగు చేసుకుంటున్న ఆ భూమిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మన్ననూర్ గ్రామంలో సిల్వర్ శివారులో సర్వేనెంబర్ 225లో నాలుగు ఎకరాల గైరాన్ భూమిని సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. వాడ్యాల గ్రామంలో సర్వే నెంబర్స్183, 184, 174, 176, 220లోని దళితుల, బీసీల భూములు కెనాల్ కాలువలో పోయాయని తెలిపారు. మిగిలిన భూమిని ఆన్లైన్ చేసి రైతుబంధు అమలు చేయాలని కోరారు.
కొత్తూరు గ్రామంలో 311 ఎకరాల గైరాన్ అసైన్డ్ భూమిని లబ్దిదారులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోయిన్‌పల్లిలో100 కుటుంబాలకు నేటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. వెంటనే వారికి కార్డులు జారీ చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. మిడ్జిల్ తహసీల్దార్ శ్రీనివాసులు స్పందిస్తూ.. సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వీటన్నింటిపై ఈనెల 17న ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ.రాములు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎం.కురుమయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధ్యక్షులు జగన్, టీపీఎస్కే జిల్లా కన్వీనర్ కురుమూర్తి, నాయకులు లక్ష్మీదేవి, నాగరాజు, కృష్ణయ్య, జంగయ్య, మధు, భాస్కర్ పాల్గొన్నారు.