Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
- హామీలు అమలు చేయని ప్రభుత్వంతో కొట్లాటే..
- ఖిలావరంగల్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
- ఎండను సైతం లెక్కచేయక భారీ ర్యాలీ
నవతెలంగాణ- వరంగల్
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. వరంగల్, రంగశాయిపేట సీపీఐ(ఎం) ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ అధ్వర్యంలో శుక్రవారం ఖిలావరంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పెద్దఎత్తున తరలివచ్చిన పేదలు భారీ ర్యాలీ తీశారు. కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటలపాటు బైటాయించారు. అనంతరం ఖిలావరంగల్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేయగా.. సరైన నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం వరంగల్ జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్.. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని చెప్పారు. హామీలు అమలు చేయని ప్రభుత్వాలతో తెగించి కొట్లాడుదామన్నారు. ఇండ్ల స్థలాలు వచ్చే వరకు ప్రభుత్వ భూములను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇండ్లు లేని పేదల కోసం రోజుకో రూపంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఖిలావరంగల్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, తిమ్మాపూర్ ప్రభుత్వ భూములు సర్వే నెంబర్ 241 బెస్తం చెరువు శిఖం సర్వే నెంబర్ 102/1, 105/1,106/1, 107/1, బి, 108/1, 120/1, 119/9, 121/1, 121/2, 128/2 జక్కలొద్ది, రంగశాయిపేట శివారు ప్రాంతాల్లో గల 180,181,182, మామూనూర్ శివారు పుట్టకోట భూములను పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం వల్లే పేదలు ఆ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారని చెప్పారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ.. ప్రతి పేదవారికి ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఇవ్వాలన్నారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, నలిగంటి రత్నమాల, సింగారం బాబు, బషీర్, రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి సభ్యులు సాంబమూర్తి, నాయకులు ప్రత్యూష, జ్యోతి, రాము, రమేష్, కృష్ణ, ఓదెలు, ప్రశాంత్, సలీం, దుర్గయ్య, శ్రీవాణి, విజయ, నర్సింహారాజు పాల్గొన్నారు.