Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కనే ఉన్న ఎమ్మెల్యేల భూములు భద్రం
- పూణె సర్వేయర్ల బృందంతో సర్వే ొ అలైన్మెంట్ మార్పు
- ముందు ఎమ్మెల్యేల భూములివ్వాలంటున్న అన్నదాతలు
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పెద్దలు ఎక్కడున్నా సేఫ్ జోన్లోనే ఉంటారు.. బక్కజీవులు ఎక్కడున్నా అన్యాయానికి గురికావాల్సిందే.. లేదంటే పెద్దల సేఫ్ కోసం పేదలను బలిచేస్తారు.. అదీ వరంగల్ 'కుడా' ల్యాండ్ పూలింగ్ అలైన్మెంట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ల్యాండ్ పూలింగ్తో రైతులకు ఉపయోగం అంటూ నమ్మబలుకుతున్న ఎమ్మెల్యేలు.. వారి భూములను ఎందుకు రక్షించుకుంటున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) మొదటి అలైన్మెంట్లో ఎమ్మెల్యేల భూములు పోకుండా అలైన్‌మెంట్‌ను మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల భూములను మాత్రమే 'కుడా' ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేకరిస్తున్న భూముల పక్కన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట వందల ఎకరాల భూములున్నా, ఆ భూములను మినహాయించి నోటిఫికేషన్లో రైతుల భూములను మాత్రమే పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి.
గ్రేటర్ వరంగల్ నగరం చుట్టూ కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్లో పేర్కొన్న గ్రామాల్లో పెద్దలను వదిలేసి.. రైతుల భూములనే చేర్చడంతో వివాదాస్పదంగా మారింది. మూడు జిల్లాలు, మూడు నియోజకవర్గాలు, 11 మండలాలు, 27 గ్రామాల్లో 22 వేల ఎకరాలను ఓఆర్ఆర్ రెండు వైపులా సేకరించి వెంచర్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.
పూణె నుంచి ప్రత్యేక బృందం సర్వే..
2021 ఆగస్టులోనే పూణె నుంచి ప్రత్యేక సర్వేయర్ల బృందం వచ్చి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరెపల్లిలో సర్వే చేసింది. రైతులకు తెలియకుండానే సర్వే చేపట్టడంతో రహదారిపై అప్పట్లో రైతులు నిరసన తెలిపారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఆరెపల్లికి చెందిన రైతు నాయకుడు బుద్దె పెద్దన్నతోపాటు మరో నలుగురు రైతులపై హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. నాడు ఆరెపల్లిలో మొదలైన ల్యాండ్ పూలింగ్ వ్యతిరేక ఉద్యమం ప్రస్తుతం 27 విలీన గ్రామాలకు పాకింది. వరంగల్ నగరం చుట్టూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. 'కుడా' సేకరించాలని భావిస్తున్న గ్రామాల్లో నలుగురైదుగురు ఎమ్మెల్యేల భూములు కూడా ఉన్నాయి. కానీ వారి భూములు మాత్రం పోవడం లేదు.
ఆరేపల్లిలో ఎమ్మెల్యే భూములు..
వరంగల్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, ఆయన కుటుంబ సభ్యులకు భూములున్నాయి. ఈ ఎమ్మెల్యే పక్కనున్న రైతుల భూములను ల్యాండ్ పూలింగ్‌లో చూపించిన అధికారులు, ఎమ్మెల్యే భూములను మాత్రం నోటిఫికేషన్లో చూపకపోవడంలో ఆంతర్యాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూములను కాపాడుకొని.. రైతుల భూములను మాత్రం లాక్కొనేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వెంటనే ల్యాండ్ పూలింగ్ జివోను రద్దు చేయాలని 27 గ్రామాల్లో రైతులు ప్రతిరోజూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.
రాంపూర్‌లో మరో ఎమ్మెల్యే భూములు
కాజీపేట మండలంలోని రాంపూర్ గ్రామంలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, ఆయన కుటుంబ సభ్యులకు భూములున్నాయి. ఈ భూములు మాత్రం ల్యాండ్ పూలింగ్‌లో పోకపోవడాన్ని ఆ గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేల భూములే తీసుకోవాలి.
బుద్దె పెద్దన్న- రైతు ఐక్య కార్యాచరణ సమితి- వరంగల్ జిల్లా కన్వీనర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూములనే 'కుడా' ముందు తీసుకొని ల్యాండ్ పూలింగ్ చేసి రైతుల విషయం మాట్లాడాలి. మున్సిపల్ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ల్యాండ్ పూలింగ్ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఈ 27 గ్రామాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూములు చాలా ఉన్నాయి. ఆ భూములను ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్లో చూపకుండా రైతుల పొట్టకొట్టి భూములను లాక్కునే ప్రయత్నం చేయడం దుర్మార్గం. నగరాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపు వుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాలు ఇస్తే.. నగరం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యేల భూములను కాపాడుకొని, మా భూములను లాక్కునే ప్రయత్నం చేయడం సరికాదు. ల్యాండ్ పూలింగ్ జీఓ 80ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.