Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ కుట్ర
- జీఐసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు : విలేకర్ల సమావేశంలో జేఏసీ నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరించొద్దని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ రీజినల్ మేనేజర్ టి.బాలగోపాల్, న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ డివిజనల్ మేనేజర్ జి నర్సింహారావు, ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కేవీవీఎస్ఎన్రాజు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1971లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సాధారణ బీమా రంగాన్ని జాతీయం చేసిందని గుర్తుచేశారు. ఇది జరిగి 51 ఏండ్లు నిండిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలైన నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను పరిరక్షించాలని శ్రీకాంత్ మిశ్రా డిమాండ్ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ కంపెనీలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లను చెల్లిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఫసల్ బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలున్నాయని చెప్పారు. బాలగోపాల్ మాట్లాడుతూ గత 22 ఏండ్లుగా ప్రయివేటు కంపెనీల అనైతిక పోటీని తట్టుకుని ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు 40శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో అగ్రగామిగా కొనసాగుతున్నదని చెప్పారు. జి నర్సింహారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు కంపెనీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నా..ఐఆర్డీఏ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
కేవీవీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను వీలీనం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మల సీతారమన్ అరుణ్ జైట్లీ ప్రకటనకు భిన్నంగా మాట్లాడుతున్నారని తెలిపారు.నాలుగు కంపెనీల్లో 100శాతం వాటాలను అమ్మటానికి వీలుగా సిద్దపడ్డారని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాల్సిన సర్కారు..కార్పొరేట్ కంపెనీలకు మద్దతివ్వటమేంటని ప్రశ్నించారు.
ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను వీలీనం చేసి ఎల్ఐసీ లాగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కస్టమర్లకు మెరుగైన సేవలందించవచ్చ న్నారు. సంక్షేమ పథకాలనుఅమలు చేయటానికి అవకాశముంటుందన్నారు. విలేకర్ల సమావేశంలో ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు, జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సౌత్ జోన్ వైస్ ప్రసిడెంట్ ఎన్ఎస్ శైలజ, అధ్యక్షులు ఏ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.