Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు ట్రెసా వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క శాతం చందాతోనే ఈహెచ్ఎస్ ద్వారా నగదురహిత వైద్యాన్ని అందించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా)రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఇదే అంశంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావును వారు కలిశారు. చందా రెండు శాతమైతే ఉద్యోగులంతా నష్టపోతారనీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్న క్రమంలో దీనిపై పునరాలోచించాలని విన్నవించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులపై పరిమితి లేకుండా నగదురహిత వైద్యం ఉచితంగా అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2017 నుంచి మూడేండ్ల పాటు నగదురహిత వైద్యం అందిందనీ, కోవిడ్ కారణంగా కార్పోరేట్ ఆస్పత్రులు ఆరోగ్య కార్డులపై వైద్యానికి అనుమతించటంలేదని తెలిపారు. పీఆర్సీ కమిటీ ప్రతిపాదించిన ఉద్యోగుల ఒకశాతం చందాపైనే నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. అన్ని సంఘాలతో చర్చించి ఉద్యోగుల శ్రేయస్సు కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనీ, ఉద్యోగులు ఆందోళన చెందొద్దని మంత్రి హామీ ఇచ్చారని ట్రెసా నాయకులు తెలిపారు.