Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత రైతులకు దాసోజు భరోసా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పలు గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం తమ భూములను బలవంతంగా గుంజుకుంటుందని శుక్రవారం గాంధీభవన్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ భూసేకరణ పేరిట వందల ఎకరాల భూములను లాక్కుంటున్నదని విమర్శించారు. కోర్టు ఆదేశాల ప్రకారం భూములు తీసుకోవడం లేదని చెప్పి... ఇప్పుడు రాత్రికి రాత్రి జేసీబీలు పంపి ఆ భూములకు కంచెలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడాబాబుల కోసం పేదల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. పేద రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కొవడానికి అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. భూములు తప్పనిసరి అయితే...2013 చట్టం ప్రకారం భూపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.