Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొదిస్తాం : ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడమే తమ లక్ష్యమని ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ధైర్యాన్ని నింపేందుకు మార్గనిర్దేశనం చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండేండ్ల నుంచి స్టూడెంట్ కౌన్సిలర్లను నియమిస్తున్నామని గుర్తు చేశారు. వారికి నిపుణులు, మనస్తత్వవేత్తల నుంచి శిక్షణ ఇప్పించామని తెలిపారు. పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడానికి విద్యార్థుల్లో భయాన్ని పోగొడతారని పేర్కొన్నారు. ఈ ఏడాది పరీక్షా చిట్కాలు, అధ్యయన నైపుణ్యాలు, ఏకాగ్రత నైపుణ్యాలు, పరీక్షల పట్ల ఆందోళన, ఒత్తిడి నిర్వహణను ఎలా అధిగమించాలనే విషయాలపై టీశాట్ ద్వారా ప్రసారం చేశామని వివరించారు. మొదటిసారి చెవిటి వ్యాఖ్యాతలనూ పరిచయం చేశామని గుర్తు చేశారు. ఇంటర్ బోర్డు, టీశాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ద్వారా మనస్తత్వవేత్తలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో భావనపై వీడియో పాఠాలను రికార్డు చేసి క్రమం తప్పకుండా ప్రసారం చేశామని వివరించారు. ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానెల్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఈ-లెర్నింగ్ తెలంగాణ'లో అప్లోడ్ చేశామని తెలిపారు. టోల్‌ఫ్రీ నెంబర్ 1800 5999 333 కి ఏ సమయంలోనైనా అవసరమైతే 24×7 ఏ సందేహాలకైనా ఉచితంగా సంప్రదించడానికి సైకాలజిస్టులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
18,435 మంది గైర్హాజరు
శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మ్యాథమెటిక్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1కు రాతపరీక్ష జరిగిందని జలీల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,69,183 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,50,748 (95.1 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 18,435 (4.9 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఖమ్మంలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు చొప్పున ఇద్దరు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసుల కింద బుక్ చేశామని తెలిపారు.
పాఠ్యపుస్తకంలో ఒకలా... ప్రశ్న మరోలా
గణితం ప్రశ్నాపత్రంపై విద్యార్థుల్లో గందరగళం
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మ్యాథమెటిక్స్ పేపర్-1బి పరీక్ష శుక్రవారం శుక్రవారం రాశారు. అయితే ఇంటర్ గణితం పాఠ్యపుస్తకంలో ఒకలా ఉంటే, ప్రశ్న మరోలా రావడం గమనార్హం. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురైనట్టు తెలిసింది. మ్యాథమెటిక్స్ పేపర్-1బి ప్రశ్నాపత్రంలో సెక్షన్ బిలోని 17,18 ప్రశ్నలు పాఠ్యపుస్తకంలో ఒకలా ఉంటే మరో విధంగా ప్రశ్న అడగడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.
ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం పాఠ్యపుస్తకంలో ఉన్నట్టుగానే ప్రశ్న అడగాలి. కానీ అలా అడగకపోవడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. అయితే పాఠ్యపుస్తకం లో లేని అలాంటి ప్రశ్నలు వచ్చినపుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమి రాసినా మొత్తం మార్కులను కలిపే విధానముంది. కానీ శుక్రవారం రాత్రి వరకు ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది.