Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మికులపై వేధింపులను ఆపాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న కార్మికుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్షన్ రావడం లేదు, డీజిల్ ఆదా చేయాలనే వాటిపై కౌన్సిలింగ్ పేరుతో కార్మికులపై ఒత్తిడి పెంచి వారిని మానసిక వ్యధకు గురిచేయడం అన్యాయమని విమర్శించారు. వారిని అకారణంగా సస్పెండ్ చేయడం వల్ల కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డిపో మేనేజర్ల దాడులు పెరిగిపోయాయని తెలిపారు. అన్ని బస్సులకూ ఒకేలా కలెక్షన్ రాబట్టడం కష్టమని తెలిసినా పెంచాలనడం దుర్మార్గమని విమర్శించారు. బస్సు కండిషన్, అది నడిచే రూట్లో ట్రాఫిక్ జామ్, ఇతర కారణాలు చూడకుండా డీజిల్‌ను ఆదా చేయాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యోగులకు కనీసం సెలవులివ్వడం లేదనీ, ఇది కార్మికుల హక్కులను కాలరాయడమేనని తెలిపారు. ఆర్టీసీ లాభాల బాట పట్టాలంటే ప్రత్యేక పద్ధతులు అన్వేషించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులను వేధించే పద్ధతికి యాజమాన్యం స్వస్తి పలకాలని కోరారు.
నరసింహారావు మృతికి సంతాపం
సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు సి నరసింహారావు మరణం పట్ల చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. రాజకీయంగా, సామాజికంగా మంచి విశ్లేషణలను అందించే ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.