Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పాలమూరు-రంగారెడ్డి'కి జాతీయ హోదా ఇస్తారా..?
- బీజేపీకి విధానాలు కాదు.. విద్వేషాలే ముఖ్యం : మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం రంగారెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి... ఆయనకు పలు ప్రశ్నలను సంధించారు. షా పర్యటన కేవలం చుట్టు చూపుగా ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తారా..? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి సబిత మాట్లాడారు. బీజేపీకి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకు విధానాలు ముఖ్యం కాదనీ, విద్వేషాలే ప్రధానమని విమర్శించారు. నవోదయ పాఠశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినప్పటికీ... కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా ఈ విషయంపై అమిత్ షా మాట్లాడతారా..? అని అన్నారు. విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. గ్యాస్, పెట్రో ధరలను తగ్గిస్తామంటూ హోం మంత్రి బహిరంగ సభలో చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు దంచటం కాదనీ, రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాలంటూ షాను డిమాండ్ చేశారు.