Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రంతా విధుల్లోనే.. తెల్లారేసరికే..
- నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఘటన
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఎంతో శ్రమకోర్చి తమ బిడ్డను ఉన్నత వైద్యురాలిగా తీర్చిదిద్దిన ఆ తల్లిదండ్రుల కలలు చెదిరిపోయాయి. బాల్యం నుంచి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పీజీ మెడికల్ విద్యార్థిని హఠన్మారణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత(25) ఎంబీబీఎస్ పూర్తి చేసి, పీజీలో సీటు సాధించి నిజామాబాద్ వైద్య కళాశాలలో గైనకాలజీ విభాగంలో చేరారు. శిక్షణలో భాగంగా గురువారం అర్ధరాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. అనంతరం రెస్ట్రూమ్లో పడుకున్నారు. ఉదయం వేళ ఇంకా బయటకు రాకపోవడంతో తోటి మిత్రులు గదిలోకి వెళ్లి చూసేసరికి ఆమె విగతజీవిగా ఉంది. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చునని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే శ్వేతది సహజ మరణమా? లేక, ఇంకేమైనా ఇబ్బందులున్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మరణ వార్త విన్న సహచర మెడికోలు కన్నీటి పర్యంతమయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ సమాచారాన్ని శ్వేత కుటుంబీకులకు తెలియజేశారు. తల్లిదండ్రులు కళావతి, శ్రీనివాస్ జనరల్ ఆస్పత్రికి వచ్చారు. విగత జీవిలా ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆమెది సహజ మరణమేనని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ చెప్పారు. గతంలో రెండు పర్యాయాలు కరోనా బారిన పడ్డారని, ఆ వ్యాధి ప్రభావంతోనే మృతిచెంది ఉంటారని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్వేత అన్న డిప్యూటీ కమిషనర్గా జార్ఖండ్లో విధులు నిర్వహిస్తుండగా.. ఆయన వచ్చాక పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఒకటో టౌన్ ఎస్హెచ్వో విజరుబాబు తెలిపారు. విద్యార్థులు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నివాళి అర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు.